జగన్ విడుదలతో ‌చెన్నైలో సంబరాలు

చెన్నై :

జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో చెన్నైలోని అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ తమిళనాడు విభాగం ‌నాయకులు జకీర్ హుస్సేన్, శరవణ‌న్ నేతృత్వంలో 20 రోజుల పాటు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా‌ చేట్‌పట్ హ్యారింగ్ట‌న్ రోడ్డులోని లేడీ ఆండా‌ల్ స్కూ‌ల్ విద్యార్థులకు‌ బుధవారం అన్నదానం చేశారు.

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విడుదలతో ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నైలోని అభిమానులు సైతం బెయిల్ వచ్చిన రోజు నుంచి తమ ఆనందాన్ని సంబరా‌లుగా పంచుకుంటున్నారు. బాణసంచా మోత మోగిస్తూ, స్వీట్లు పంచిపెడుతూ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. చెన్నైలోని వివిధ ఆశ్రమాల్లో ఉన్న పేదలకు 20 రోజుల పాటు అన్నదానం చేయడానికి పార్టీ తమిళనాడు విభాగం ఏర్పాట్లు చేసింది.

వైయస్ఆర్ చిత్రపటానికి నివాళు‌లు అర్పించిన అనంతరం లేడీ ఆండా‌ల్ స్కూ‌ల్ విద్యార్థులకు‌ అన్నదాన కార్యక్రమా‌న్ని తమిళనాడు విభాగం నేతలు జకీర్ హుస్సేన్, శరవణ‌న్ ప్రారంభించారు. పేద ఆశ్రమాలు, పేద విద్యార్థులు ఉండే ప్రదేశాలను గుర్తించి 20 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాలాజీ, పాండియన్, రాజేంద్రన్, సతీష్, స్టాన్లీ జగన్, కృపానందన్, పళని, వెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు.

చెన్నై నగరంలో పలుచోట్ల జగన్‌ పోస్టర్లు :
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో ఆయనకు ఆహ్వానం పలుకుతూ చెన్నై నగరంలో అనేక చోట్ల పోస్టర్లు వెలిశాయి. వైయస్ఆర్‌ కాంగ్రెస్ తమిళనాడు విభాగం నేతృత్వంలో ప్రత్యేకంగా ఆయి‌ల్ ప్రింట్ ఆ‌ర్ట్సు పోస్టర్ల వేశారు. ‌'జగన్ ఈజ్ బ్యాక్‌' నినాదంతో ప్రజలకు‌ శ్రీ జగన్ నమస్కరించే విధంగా, ఆ దృశ్యాన్ని మహానేత వైయస్ఆర్ వీక్షించే రీతిలో ఈ పోస్టర్ రూపొందించారు. పెరంబూరు, తండయా‌ర్‌పేట, రాయపురం, ప్యారిస్, సెంట్రల్, ఎగ్మూర్, నుంగంబాక్కం, వళ్లువర్ కోట్టం, రాధాకృష్ణ సాలై, పురసై వాక్కం, చే‌ట్ పట్, అడయార్, ‌టి.నగర్, వెస్టు మాంబలం, కోడంబాక్కం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

శరవణన్, జకీర్ హుస్సే‌న్‌ హర్షం :
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జనంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని శరవణన్, జకీర్ హుస్సే‌న్ ‌హర్షం వ్యక్తంచేశారు. తమ నాయకుడు జైలు నుంచి బయటకు రావడంతో ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారడం తథ్యమన్నారు. శ్రీ జగన్ రాక సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత బలం చేకూ‌రుతుందన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడు విభాగం నేతృత్వంలో పార్టీ పటిష్టానికి, శ్రీ జగన్‌కు మద్దతుగా కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు.

Back to Top