చరిత్రను విస్మరించిన బాబు....జగన్

హైదరాబాద్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం ఇక్కడి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. సహేతుకమైమ కారణం ఏదీ చూపకుండా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినం అయిన ఒక చారిత్రక రోజును మార్పు చేస్తూ అవివేకమైన చర్యకు పాల్పడిందని వైఎస్సార్సీపీ విమర్శించింది.

'చారిత్రక వాస్తవాలకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా మరికొన్ని ఇతర రాష్ట్రాలతో కలసి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి ఈ రోజును చంద్రబాబు నాయుడు జూన్ 2కు ఎందుకు మార్చారో అర్థం కావడం లేదు. అయితే తెలుగుప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించినందున  మేము ఈరోజునే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం' అని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో పాల్గొంటూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ తమ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పటికీ మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు చారిత్రక దినం అయిన  నవంబర్ 1నే తమ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పాటిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి వేరుపడి కొత్త రాష్ట్రాలుగా అవతరించినవి ఏరోజున కొత్త రాష్ట్రంగా అవతరించాయో ఆ రోజున అవి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరు పడి భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించినందున ఆరోజున తెలంగాణ తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సముచితం. కానీ నవంబర్ 1న ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందని శ్రీ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నది నిర్వివాదాంశం. అది చారిత్రక సత్యం కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని మారుస్తూ తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం ఎందుకు నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థంకాని విషయం అన్నారు శ్రీ జగన్.

చంద్రబాబు నాయుడు తన మైండ్ సెట్ ను మార్చుకుని రాష్ట్ర అవతరణ దినాన్ని నవంబర్ 1కి తిరిగి మార్చాలి. అలా చేయని పక్షంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా దీనిని మారుస్తాం. అనేక మంది అమరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ఇది. సమైక్యవాద పార్టీగా ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ఈ మార్పును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు.
Back to Top