ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే కరువుపై వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం ఇందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. దీంతో సభను పది నిమిషాలు వాయిదా వేయడంతో మీడియా పాయింట్‌ వద్ద ప్రభుత్వ తీరును చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎండగట్టారు.  రాష్ట్రంలో కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రెయిన్‌గన్లతో కరువను పారద్రోలామని ప్రభుత్వం అసత్యాలు చెబుతుంది. ఎకరా పంట పండాలంటే 30 ఎంఎం మోటార్‌ కావాలి. వీళ్లు అరగంట రెయిన్‌గన్లతో నీటిని తడిపి పంటంతా కాపాడామని చెబుతున్నారు. అనంతపురంలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారంటే ఆ జిల్లా అంతా కరువు ఉన్నట్లే కదా అని నిలదీశారు. 

మా జిల్లాలో టమోట పంటకు గిట్టుబాటు ధర లేదు. 20 పైసలకు అమ్ముకుంటున్నారు. కూలీల ఖర్చులు కూడా రావడం లేదు. రుణమాఫీ చేయకుండా ఆపేయడంతో కొత్త రుణాలు రావడం లేదు. బయట డబ్బులు దొరకడం లేదు. బ్యాంకులు డబ్బులు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కొద్దోగొప్పో నీరుండి పంట పడించినా గిట్టుబాటు ధర లేదు. పది మందికి అన్నం పెట్టిన అన్నదాతలు అన్నమో రామచంద్రా అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ ఉచిత కరెంటు ఇచ్చి, రైతు రుణాలు మాఫీ చేసి, 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులు తెల్ల పంచెలు కట్టుకుని తిరిగేలా చేశారు. 

కానీ బాబు వచ్చాక రైతులు కరువుతో అల్లాడుతున్నారు. గవర్నర్‌ ప్రసంగలోనూ, బడ్జెట్లో కరువుకు ఎందుకు నిధులు కేటాయించడం లేదు. మీకు చిత్తశుద్ధి లేదు, మేం సూచనలు ఇస్తామని, కరువుపై చర్చిద్దామంటే చర్చకు అంగీకరించకుండా తిరష్కరించడం దారుణం. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, రైతులకు సాగునీరు అందించాల్సిందే, గిట్టుబాటు ధర కల్పించాల్సిందే.  అన్నం పెట్టే స్థితికి తీసుకురావాలి. ఆ రోజు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఈ రోజు పూర్తిగా కార్యరూపంలోకి తీసుకొని వచ్చారు. రాజధాని పేరుతో మూడు పంటలు పండే భూములు లాక్కొన్నారు.  ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టొచ్చు కదా. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా ఉండదని చెవిరెడ్డి తూర్పారబట్టారు. 
 
Back to Top