తెలంగాణలో ఆంధ్ర విద్యార్థులకు అన్యాయం

విజ‌య‌వాడ‌: తెలంగాణ రాష్ట్రంలో విద్యనభ్యసిస్తున్న ఆంధ్రప్రాంత విద్యార్థులకు అన్యాయం జ‌రుగుతోంద‌ని, టీఆర్ఎస్‌  ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ ఫీజులు ఇవ్వాలని వైయ‌స్ఆర్‌  స్టూడెంట్స్‌ యూనియన్ విజ‌య‌వాడ‌నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రాంత విద్యార్థులకు ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించిందన్నారు. ఆసమయంలో విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వ ఇప్పటికి వారి సమస్యలను పరిష్కరించలేదన్నారు. అక్కడి విద్యాసంస్థలు ఫీజులు చెల్లించాలని వత్తిడి చేస్తుండడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.  ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించి వారిని ఉన్నత స్థితిలో ఉంచుతామని చెప్పిన మంత్రి రావెల కిషోర్‌బాబు మాటలు నీటిమూటలయ్యాయన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. అట్టడుగువర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదన్నారు.  ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీల ఊసే ఎత్తడం లేదన్నారు. విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టారని, మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్కరికీ సైకిల్‌ అందజేసిన పాపాన పోలేదన్నారు. తక్షణమే చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల సమస్యలపై మంత్రిని కలిసి తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు బాలనారాయణ, దినేష్‌కుమార్, కార్యదర్శి అర్జున్, 24వ డివిజన్‌ అ«ధ్యక్షుడు బీ అశోక్,.  జావిద్, సాహిల్, సుందర్‌ పాల్గొన్నారు. 

Back to Top