ఇంకెన్నాళ్ళు జైల్లో ఉంచుతారు

అనంతపురం అర్బన్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జనం మధ్యకు రానున్నారని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి తెలిపారు. యావదాంధ్ర దేశం జగన్ ఎప్పుడు బయటకు వస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తోందన్నారు. జగన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ, ఎక్కడ వైయస్ఆర్‌ సీపీకి పట్టం కడుతారోననే భయంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్ని జగన్‌పై అక్రమ కేసులు బనాయించాయన్నారు. ఆయనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం అని రుజువు కాలేదన్నారు. నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. సీబీఐ దురుద్దేశంతో అక్రమ చార్జి షీట్లు వేస్తూ వైయస్ఆర్‌ సీపీ అధినేతకు బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగా ఉండాలే కానీ కేంద్రం కనుసైగల్లో నడుచుకోకూడదని సూచించారు. న్యాయవ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందని, త్వరలోనే జగన్ విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ మంత్రులను ఒక రకంగా, జగన్‌ను మరో రకంగా చూస్తోందని సీబీఐపై ధ్వజమెత్తారు. మైనార్టీ నాయకుడు సాలార్ బాషా మాట్లాడుతూ మంత్రి ధర్మానకు ఒక్క రోజులో బెయిల్ ఇచ్చి, జగన్‌ను నెలల తరబడి జైల్లో ఉంచడం దారుణమన్నారు. సీబీఐ, టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై  జగన్‌పై కక్ష సాధిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంక రనారాయణ, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి, ధనుంజయయాదవ్, ఆలూరు సాంబశివారెడ్డి, యోగీశ్వర రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, చింతకుంట మధు, బోయ సుశీలమ్మ, కృష్ణవేణి, నిర్మల, శ్రీదేవి, సానె ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Back to Top