విశ్వసనీయతకే కట్టుబడి ఉన్నా


ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా), 21 మే 2014 :

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకే తాను కట్టుబడి ఉన్నానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.‌ ఆ నాడు విలువల కోసమే తాను, తన తల్లి శ్రీమతి వైయస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చామన్నారు.‌ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాలుగేళ్ళుగా ప్రజల సమస్యలపై పోరాటం చేశామని, అందుకే అధికారంలోకి వస్తామనే విశ్వాసం కలిగిందన్నారు. తనపై విశ్వాసం ఉంచి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో బుధవారం జరిగిన పార్టీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులోనూ పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.

గడచిన నాలుగేళ్ళలో అనేక కుట్రలు, కుతంత్రాలను చూశామన్నారు. కేంద్రం సీబీఐ అనే ఆయుధాన్ని వినియోగించి, అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. 16 నెలలు తనను జైలులో నిర్బంధించి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఒక్క శాసనసభ్యుడు కూడా తనను విడిచి వెళ్లలేదని ఆయన అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు అలానే పార్టీ వెంటే ఉన్నారన్నారు. రాజకీయం ఉన్నా, లేకపోయినా మనిషి మనిషిగా బతకాలని తన మనసు చెప్పిందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మెదడు చెప్పిన మాట కన్నా... మనసు చెప్పిన మాటనే విన్నానని ఆయన పేర్కొన్నారు.

నరేంద్రమోదీ గాలి వల్లే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని శ్రీ వైయస్‌ జగన్‌ విశ్లేషించారు. వైయస్ఆర్‌సీపీ- టీడీపీ మధ్య ఓట్ల తేడా కేవలం ఒక్క శాతం మాత్రమే అన్నారు. రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలు వైయస్ఆర్‌సీపీని ఆదరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరికొంత కాలం పరీక్ష పెట్టాలని ప్రజలు భావించారేమో అన్నారు. ఇడుపులపాయలో బుధవారం జరిగిన వైయస్ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేపడతానని, నాలుగేళ్లుగా అనేక అంశాలపైన తామే పోరాటం చేశామని, ప్రజలకు అండగా నిలబడ్డామని శ్రీ జగన్‌ అన్నారు. తాను, తన తల్లి కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చినప్పుడు 'కొండను ఢీకొంటున్నామని... నాశనమైపోతామని' అందరూ అన్నారని, అధికార పార్టీపై పోరాటం కష్టమని వ్యాఖ్యానించారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ అనేక అంశాలపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మాత్రమే పోరాటాలు చేయగలిగిందని శ్రీ జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు హామీలు ఇస్తున్నప్పుడు... తనను కూడా అలాంటి హామీలు ఇవ్వమని చాలా మంది చెప్పారని, అయితే తాను అలా చేయలేదన్నారు. రాజకీయాల్లో తాను నమ్మిన సిద్ధాంతం విశ్వసనీయత, విలువలు అని శ్రీ జగన్ అన్నారు. వాటికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. మనిషిలో విశ్వసనీయత, విలువలు లేకపోతే కట్టుకున్న భార్యకు కూడా సమాధానం చెప్పుకోలేమన్నారు. చేయలేని‌ దాన్ని చేస్తానని తాను చెప్పలేనని శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజా సమస్యల పైనే మోడీని తాను కలిశానని చెప్పారు. బిల్లులో చేర్చాల్సిన అంశాలపై ఆయనకు వివరించానన్నారు. విధానాలు నచ్చితే అంశాలవారీగా మోడీకి మద్దతు ఇస్తామన్నారు. 2019 నాటికి పార్టీని గ్రామ స్థాయి నుంచీ పటిష్టం చేస్తామని శ్రీ జగన్‌ చెప్పారు.

Back to Top