వరద బాధితులను పట్టించుకోని సీఎం కిరణ్

కాకినాడ, 29 అక్టోబర్ 2013:

తుపాను, భారీ వర్షాలు, వరదలకు విపరీతంగా నష్టపోయిన బాధిత రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికులను చూసి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కదిలిపోయారు. శ్రీమతి విజయమ్మ మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పాడైపోయిన పంటలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు.

జిల్లాలోని జగ్గంపేట నుంచి ఉదయం తన పర్యటనను శ్రీమతి విజయమ్మ ప్రారంభించారు. కాట్రామలపల్లి, దుగ్గుదూరు, బిక్కవోలు, కాకినాడలలో పర్యటించారు. నీటమునిగిన వరిచేలను ఆమె పరిశీలించారు. రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికుల బాధలు స్వయంగా విన్నారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.

అనంతరం శ్రీమతి విజయమ్మ కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ప్రజలు ముంపు బారినపడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి స్పందించలేదని నిందించారు. ఇప్పటి వరకు ముంపు బాధితులకు ప్రభుత్వం బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయలేదని ‌అన్నారు. అకాల వర్షాల కారణంగా చేనేత కుటుంబాలు ఆకలి బాధతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాచోట్ల మగ్గాలు నీటిలో మునిగి తడిసిపోయినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తెస్తుందని చెప్పారు. వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే మత్స్యకారులు, చేనేత కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.

భారీ వర్షాలు వచ్చి ఆరు రోజులవుతున్నా ఒక్క అధికారి కూడా బాధితుల దగ్గరకు వచ్చి వివరాలు అడగలేదని  శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే కాదు, మత్స్యకారులు, నేతన్నల పరిస్థితి  దారుణంగా ఉందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల వరి చేలు, 50 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు నష్టపోయాయని తెలిపారు. ఈ జిల్లాలో వెయ్యి ఇళ్లు  పూర్తిగా, రెండు వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయన్నారు. నీలం తుపాను తరువాత తూర్పు గోదావరి జిల్లాకు 167 కోట్ల రూపాయలు ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే ఏలూరు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తారని ఆమె హామీ ఇచ్చారు.

Back to Top