కృష్ణా జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ కుఅడుగడుగునా ఘన స్వాగతం

కృష్ణా:  వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పెడనలో జరిగిన పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము వివాహ రిసప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఉదయం 8.45 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయనకు జిల్లావ్యాప్తంగా భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం జగన్ ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గం ద్వారా పెడన వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, తూర్పుకృష్ణా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, జోగి రమేష్,  గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, బాపులపాడు జెడ్పీటీసీ కైలే జ్ఞానమణి, గన్నవరం సర్పంచి నీలం ప్రవీణ్‌కుమార్  తదితరులు ఉన్నారు.

చంటి కుమారైకు ఆశీర్వాదం
పట్టణంలోని పెద ఎరుకపాడులోని వైఎస్సార్ సీపీ నాయకుడు పాలేటి చంటి గృహానికి జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లారు. మే ఒకటో తేదీన చంటి కుమార్తె నిహారిక వివాహం జరగనున్న నేపథ్యంలో ఆమెను జగన్ ఆశీర్వదించారు.
 
ఉప్పాల రాము రిసెప్షన్‌కు హాజరు
మచిలీపట్నం : పెడన మండలం కూడూరు పంచాయతీ శివారు కృష్ణాపురం గ్రామానికి జగన్ మోహన్‌రెడ్డి విచ్చేశారు. పార్టీ నాయకులు ఉప్పాల రాంప్రసాద్ కుమారుడు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము వివాహం ఇటీవల జరిగింది. కృష్ణాపురంలో సోమవారం రిసెప్షన్  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హాజరై నూతన దంపతులు రాము, హారికను ఆశీర్వదించారు.  కాగా, బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ మంగినపూడి బీచ్ వద్ద ఉన్న మేరీమాత విగ్రహాన్ని అకారణంగా అధికారులు కూల్చివేశారని తరంగిణిమాత విచారణలోని గ్రామాల ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
 
విమానాశ్రయంలో వీడ్కోలు
జగన్ తన పర్యటనను ముగించుకుని సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్‌రూమ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎయిర్‌కోస్తా విమానంలో బెంగళూరు వెళ్లారు. ఆయనకు ఉదయం స్వాగతం పలికిన వారితో పాటు ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి తదితరులు వీడ్కోలు పలికారు.
Back to Top