గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తం: శోభా నాగిరెడ్డి

కర్నూలు : కాంగ్రెస్‌ పార్టీ అసమర్థ పాలన, టిడిపి కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా లేని కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో గ్రామాల్లో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని దుయ్యబట్టారు. ఇంతవరకూ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకపోవడమేమిటని ఆమె నిలదీశారు. జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలోని కొండుపల్లె ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను శోభానాగిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్, ‌టిడిపిలపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారన్నారు. అందుకే వారంతా ప్రత్యామ్నాయం వైపు ఎదురుచూస్తున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మరణానంతరం దోచుకోవడం‌, దాచుకోవడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందన్నారు. మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కి ప్రజలకు అందకుండా దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామాల్లో గాడి తప్పిన పరిపాలన ‌కారణంగానే ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1800 కోట్లు నష్టపోయామన్నారు. గ్రామాల్లో ఏ చిన్న అభివృద్ధి పని చేపట్టాలన్నా నిధుల లేమి సమస్య వేధిస్తోందన్నారు. సొసైటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రోజుకో జీఓ విడుదల చే స్తోందని విమర్శించారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న నేత వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి మాత్రమేనని, అప్పటి సువర్ణ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

‌వైయస్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రాకుండా కాంగ్రెస్, ‌టిడిపిలు కుట్ర పన్నుతున్నాయన్నారు. అయితే, శ్రీ జగన్ నిర్దోషి‌ అని ప్రజా కోర్టులో వెల్లడైందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి శ్రీ వైయస్ జగ‌న్‌ను సీఎం చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top