హైదరాబాద్) కొత్త సంవత్సరంలో వైఎస్సార్సీపీ కి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు శుభ ఫలితాలు ఉంటాయని ప్రముఖ పంచాంగ కర్త మారేపల్లి రామచంద్ర శాస్త్రి అభిప్రాయ పడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి లో పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కొత్త సంవత్సరంలో పార్టీకి అన్నీ కలిసివస్తాయని పంచాంగ కర్త విశ్లేషించారు. ప్రజల తరపున ఉద్యమిస్తున్న మార్గంలో పార్టీ బలపడుతుందని ఆయన అన్నారు. ఆరోపణలు, దొంగ కేసుల నుంచి అధ్యక్షులు వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అభిలషించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని దక్షిణ భారత దేశంలోనే బలమైన నాయకుడిలా ఎదుగుతారని అభిప్రాయ పడ్డారు. తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ప్రసాదాల్ని నాయకులకు అందించారు. ఉగాది పచ్చడిని అందరికీ పంచారు.ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. అన్ని వర్గాల ప్రజలకు శుభ ఫలితాలు కలగాలని ఆకాంక్షించారు. వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని ఆశించారు. అంతా ఆనందంగా ఉండాలని కోరుకొన్నారు. గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకొంటున్నానని, దేవుడ్ని వేడుకొంటున్నానని చెప్పారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. వానలు పడి, వ్యవసాయదారులకు మేలు జరగాలని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిలషించారు.