ప్లీనరీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం

హైదరాబాద్, 27 జూలై 2013:

తెలంగాణ విషయంలో ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టంచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు కాంగ్రెస్ పార్టీ‌ తీరుకు నిరసనగానే కానీ తెలంగాణకు వ్యతిరేకంగా కాదని, సీమాంధ్రకు అనుకూలంగానూ కాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ వివరణ ఇచ్చారు. తెలంగాణ విషయంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏమిటని కొండా సురేఖ నిలదీస్తున్న నేపథ్యంలో సమాధానం ఏమిటన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు గట్టు సమాధానాలు ఇచ్చారు. సమైక్యాంధ్ర కోసం తాము రాజీనామాలు చేయడం లేదని పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పారన్నారు. పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తేడా లేకుండా ప్రజలను మళ్ళీ గందరగోళంలోకి నెట్టివేస్తున్న కాంగ్రెస్‌ తీరుకు నిరసనగానే తమ రాజీనామాలని వారు స్పష్టం చేశారన్నారు.

నాలుగు ప్రాంతాల కాంగ్రెస్‌ ప్రతినిధులు రాష్ట్రాన్ని పాడె మీద పెట్టి సోనియా గాంధీ వద్దకు తీసుకుపోయి, తలకొరివి పెట్టించే పని చేస్తున్నారని గట్టు రామచంద్రరావు విమర్శించారు. కేంద్రప్రభుత్వానికి, పార్టీకి, సిడబ్ల్యుసికీ తేడా లేకుండా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ సమస్యను ఒక తండ్రి స్థానంలో ఉండి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయాలన్నారు. తెలంగాణకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేకం కాదని స్సష్టంచేశారు. తెలంగాణా వాదుల పోరాటాన్ని గౌరవిస్తూ అమరవీరులకు సంతాపాన్ని కూడా తెలియజేసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ అమరులకు సంతాపం తెలిపినవారిని ఒక పార్టీ చెప్పులతో కొట్టిన వైనాన్ని గట్టు ప్రస్తావించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా రాజీనామాలు చేశారే గాని అవి పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని గట్టు వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా రాజీనామాలు చేశారా? లేక పార్టీ నిర్ణయమా? అనే పార్టీ గౌరవ అధ్యక్షురాలు గానీ, ప్రతినిధులు గాని స్పష్టం చేయాలని కొండా సురేఖ నిన్న మీడియా సమావేశంలో చెప్పిన విషయాన్ని ఒక ప్రశ్నకు బదులుగా గట్టు చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సురేఖ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రాజీనామాల అంశంలో వారికి సరిగా అర్థం కాకపోతే మరోసారి వివరణ తీసుకుంటారన్నారు. అనుమానాలు ఉంటే పార్టీలో చర్చించుకుంటామన్నారు. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకుంటారని అన్నారు. సురేఖ తదితరులు పార్టీకి రాజీనామాలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

తెలంగాణలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 193 స్థానాలు మాత్రమే వచ్చాయని, మలి విడతలో ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో పార్టీకి మంచి ఫలితాలే వస్తున్నాయని గట్టు రామచంద్రరావు చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వెనుకబడిన మాట వాస్తవమే అని అన్నారు. తెలంగాణలో కూడా క్షేత్ర స్థాయిలో ముందుకు రావడానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో ఓటు శాతాన్ని మరింతగా పెంచుకోవడానికి తెలంగాణ నాయకులు, పార్టీ శ్రేణులు మరింత పట్టుదలతో పనిచేస్తారన్నారు. పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడం, శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర లేకపోవడం, శ్రీమతి షర్మిల పాదయాత్ర కూడా తెలంగాణలో మొత్తంగా కొనసాగకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయిందని వివరణ ఇచ్చారు. పార్టీ నాయకులు బి. జనక్‌ప్రసాద్‌, శివకుమార్‌, నల్లా సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top