కంగుతిన్న యెల్లో మీడియా: గట్టు

హైదరాబాద్:

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేసరికి, ఇన్నాళ్లూ దుష్ర్పచారం చేసిన యెల్లో మీడియా కంగుతిని పిచ్చి రాతలు రాస్తోందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. మరణించిన టీడీపీ వద్ద జ్యోతి వెలిగించేందుకు యెల్లో గ్యాంగ్ శతవిధాలా ప్రయత్నిస్తూ.. తమ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతోందని‌ ఆయన మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వైయస్ఆర్‌సీపీ సహకరిస్తోందంటూ ఓ తోక పత్రిక కథనాలు వండివార్చుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద‌ ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో అత్యధికంగా లబ్ధి‌ పొందింది తెలంగాణ ప్రాంతమే అని గట్టు గుర్తుచేశారు. మహానేత ఆకస్మిక మరణం వల్ల ఎక్కువగా చనిపోయింది తెలంగాణలోనే అన్నారు. తెలంగాణలోనూ వైయస్ఆర్ పేరు చెబితే ఓట్లు పడే పరిస్థితి కనిపించడంతో వై‌యస్ఆర్‌సీపీ ఎక్కడ వేళ్లూనుకుంటుందో అనే భయంతో కొత్త రకం కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసేసరికి, తోకపత్రికకు కాంగ్రెస్‌పై అంతగా ప్రేమ పుట్టుకొచ్చిందా? లేక కాంగ్రెస్‌కు చంద్రబాబుపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని గట్టు ప్రశ్నించారు.

‘తెలంగాణలో శ్రీ వైయస్ జగ‌న్ ఓదార్పుయాత్ర‌కు వస్తే రాళ్లు వేసింది టీఆర్‌ఎస్ కాదా? ఎర్రబెల్లి దయాక‌ర్‌రావు ఏకంగా ధర్నా చేపట్టారు. శ్రీమతి షర్మిల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించడానికి శ్రీమతి విజయమ్మ వస్తే అడ్డగించింది కాంగ్రెస్ కాదా? అందుకే తెలంగాణలో ఇప్పుడు మేం అడుగుపెడితే వీళ్ల అడుగులు జారిపోతాయనే భయం అన్ని పార్టీలకూ పట్టుకుంది’ అని‌ గట్టు రామచంద్రరావు అన్నారు.

Back to Top