ప్రశ్నార్థకంగా మారిన ఎంపీ కొత్తపల్లి గీత భవిష్యత్తు

తూర్పుగోదావరి: కుల ధ్రువీకరణ వివాదంలో విశాఖ జిల్లా అరకు కొత్తపల్లి గీత సోదరుడికి షాక్ తగిలింది. ఎంపీ సోదరుడు వివేకానంద కుమార్ ఎస్టీ కాదని జిల్లా విచారణ కమిటీ తేల్చింది. దీంతో కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణపైనా విచారణ జరగనుంది.  వివేకానంద తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో బీమా కంపెనీలో ఉద్యోగం సంపాదించారని, ఆతని ఎస్టీ సర్టిఫికెట్‌పై విచారణ జరపాలని గిరిజన సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపారు. విచారణలో  వివేకానంద ఎస్టీ కాదని తూర్పుగోదావరి జిల్లా అధికారులు తేల్చారు. ఈ మేరకు అతడికి నోటీసులు కూడా అందాయి.

మరోవైపు కొత్తపల్లి గీత గిరిజన కులానికి చెందిన వ్యక్తి కాదని, ఆమె ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అరకు ఎంపీగా ఎన్నికైన కొత్లపల్లి గీత... ఆది ఆంధ్రా మాల కులానికి చెందిన వ్యక్తి అని, ఆమె క్రిస్టియన్‌గా మారిందని... 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఆమె కులధృవీకరణ పత్రాన్ని రద్దు పరుస్తూ, గీత గిరిజనురాలు కాదని, క్రిస్టియన్ బీసీ ‘బి’ కేటగిరీగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంపీ సోదరుడు ఎస్టీ కాదని డీఎల్‌ఎస్‌సీ నివేదిక ఇవ్వడంతో ఎంపీగీత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆమె కులధ్రువీకరణకు సంబంధించి పలువురు కేసులు వేశారు. 
Back to Top