ఫీజు పోరుతో ప్రభుత్వంలో చలనం రావాలి

కళ్యాణదుర్గం: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్‌లో చేపట్టే ‘ఫీజు పోరు’తో ప్రభుత్వంలో చలనం రావాలని పార్టీ జిల్లా నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి చెప్పారు. ఫీజు పోరును విజయవంతం చేసేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఫీజు పోరు ఫ్లెక్సీలను ఆయన కళ్యాణదుర్గంలో విడుదల చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందిచడమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

ఫీజు రియింబర్సుమెంటును కొనసాగించాలి: భూమన
తిరుపతి: విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని కొనసాగించడంలో ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం నాటకం ఆడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం కొర్లగుంట మారుతీనగర్, ఎస్టీకాలనీల్లో ప్రజాబాట సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం భారంగా భావిస్తోందని, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షను చేపట్టనున్నారని చెప్పారు.

వైఎస్ హయాంలో విద్యారంగ అభివృద్ధి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున
గుంటూరు: దేశ రాజకీయాలను శాసించేది విద్యార్థులేనని.. వారి ప్రయోజనాలను కాపాడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పార్టీ నాయకుడు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున చెప్పారు. వర్సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జూనియర్ విద్యార్థులకు స్వాగత సభ, అనాథపిల్లలకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా విద్యార్థులు రూపొందాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్సార్ విద్యారంగంలో ప్రత్యేక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అన్నివర్గాల విద్యార్థులకు ఉన్నత, సాంకేతిక విద్య అందించేలా ట్రిపుల్ ఐటీ, జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆయన హయాంలో వెలుగొందిన విద్యారంగం నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంధకారంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన అన్నివర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ కల్పించిన ఘనత వైఎస్ సొంతం అన్నారు.

వికలాంగుల దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు
గుంటూరు: వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగా కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు మంగళవారం అప్పిరెడ్డిని అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో కలసి దీక్షకు మద్దతు తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని చెప్పారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావుమాదిగ మాట్లాడుతూ రాజధానిలో మంద కృష్ణ చేపడుతున్న దీక్షలకు మద్దతుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులతో కలసి దీక్ష చేపడుతున్నట్లు వివరించారు.

సాగు నీటి ప్రాజెక్టులపై శీతకన్ను
నల్లచెరువు: సాగునీటి ప్రాజెక్టులపై రాష్ర్ట ప్రభుత్వం శీతకన్ను వేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ‘రైతుబాట’లో పాల్గొన్న వీరు బందార్లపల్లి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో హంద్రీనీవా కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. ‘రైతుబాట’ రెండో రోజు మంగళవారం నల్లచెరువు మండలంలోని ఉబిచెర్ల, గొర్లవాండ్లపల్లి, గోరంట్లవారిపల్లి, దామావాండ్లపల్లి, బందార్లపల్లి, కల్లిపల్లి, యర్రగుంట్లపల్లి గ్రామాల మీదుగా తనకల్లుకు చేరుకుంది. ముఖ్య అతిథులుగా డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, శంకరనారాయణ, పార్టీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

Back to Top