రైతులను రోడ్డుకు ఈడుస్తున్నారు

ధాన్యానికి సరైన మద్దతు ధర ప్రకటించాలి
రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి 

హైదరాబాద్‌: ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న విధానం వ్యవసాయాన్ని మానుకోండని పరోక్షంగా చెప్పినట్టుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. 2016–17 సంవత్సరానికి సంబంధించి ధాన్యానికి కనీస మద్దతు ధరను కేవలం రూ. 60 పెంచిందంటే ధాన్యాన్ని పండించే రైతుల్ని తీవ్ర మనోవేదనకు గురిచేయటమే అన్నారు.  అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో  ఒకే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. రైతు గురించి, మద్దతు ధరల గురించి గత పదేళ్లు తాము ఏం మాట్లాడామన్నది ఈ పార్టీలు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. 

ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని బీజేపీ 2014 ఎన్నికల్లో వాగ్ధానం చేసిందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను అమలు చేసి రైతులకు లాభసాటి ధరను కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఊరు–వాడా ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ముష్టివేసినట్లుగా క్వింటాల్‌కు రూ. 50 మాత్రమే పెంచారని మండిపడ్డారు. ఈ ఏడాది మాత్రమే క్వింటాలుకు రూ. 60 ధర పెంచి.... కనీస మద్దతు ధరను పెంచబోమని రైతులను వ్యవసాయం నుంచి రోడ్డుమీదకు ఈడ్చే కార్యక్రమం చేస్తోందని  ప్రభుత్వంపై ఫైరయ్యారు.  

రైతులకు మద్దతు ధరలు ఇవ్వని కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతులే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించకపోవడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర రైతులపై ఎంతటి మమకారం ఉందో ఇట్టే అర్థమైపోతుందన్నారు. ఎన్నికల వాగ్ధానాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరైన మద్దతు ధరను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు భరోసా ఇవ్వలేనిపక్షంలో దేశంలో అనేక సంక్షోభాలు, అవాంఛనీయ పరిణామాలుకు దారి తీస్తాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగివచ్చి రైతుల సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ప్రభుత్వాలను కోరారు. 
Back to Top