వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశ్వరూ‌ప్

హైదరాబాద్, 18 అక్టోబర్ 2013:

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం‌నాడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విశ్వరూ‌ప్కు‌ శ్రీ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశ్వరూప్‌తో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా శ్రీ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ మంత్రి పదవికి, కాంగ్రె‌స్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వరూ‌ప్ మాట్లాడుతూ‌, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే స్పష్టంగా పోరాటం చేస్తున్నదని అన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్‌ ఒక్కరే మొక్కవోని ధైర్యంతో సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకుపోతున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతృత్వంలో తాను సుశిక్షితుడైన సైనికుడిలా పోరాడతానని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అన్నారు. గతంలో జరిగిన ఏ ఎన్నికను చూసుకున్నా ఏదో ఒక్క పార్టీకే పట్టం కట్టడం తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకత అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించేలా కృషి చేస్తామని విశ్వరూప్‌ అన్నారు.

Back to Top