ఈ ప్రభుత్వానికి ప్రజలపై ద్వేషం!

గూడూరు (కర్నూలు జిల్లా) 19 నవంబర్ : ఒక్క రాజన్న కుటుంబం
మీద మాత్రమే కాదు, ప్రజలందరి మీదా ద్వేషంతో కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం
వ్యవహరి స్తోందని షర్మిల విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క వర్గం మీద కూడా ప్రేమ లేదన్నారు. 'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా ఆమె సోమవారం గూడూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.
షర్మిల మాటల్లోనే...
"నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచేశారు. కాళ్లకి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు మా పిల్లలు. చదువులకైతే దిక్కే లేదు. కూలీలకు తీసుకుపోతున్నాం. ఉపాధి హామీ ఇప్పుడు పని చేయడం లేదు. కేవలం ఇరవై ముప్ఫై రూపాయలే ఇస్తున్నారు. అయినా దిక్కులేక ఆ పనికి వెళుతున్నామని మహిళలు చెపుతోంటే చాలా బాధేసింది. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఉపాధి హామీ పథకం అద్భుతంగా జరిగేది. రూ.120 ఇచ్చేవారు. రైతులకు, మహిళలకు పావలా వడ్డీ అద్భుతంగా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అప్పుడు పావలా వడ్డీ అంటే పావలా వడ్డీ మాత్రమే కట్టించుకునేవారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు  రూపాయి, రెండు రూపాయల దాకా కూడా వడ్డీ పడుతోందట.
విద్యార్థులకైతే రాజశేఖర్ రెడ్డిగారు కన్నతండ్రిలాగా ఏ చదువు కావాలంటే అది చదవండని చదివించేవారు. ఇప్పటి ప్రభుత్వానికి విద్యార్థులంటే లెక్కే లేదు. ఫీజు పథకానికి కత్తెరలు పెడుతూ భిక్షమిచ్చినట్లు ఇస్తోంది. దీని ఎంతో మంది విద్యార్థుల చదువు ఆగిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు. ఒక పాప అయితే 80 పర్సంట్ మార్కులు వచ్చాయట. వాళ్ల నాన్నకు చదివించే స్థోమత లేదట. పాపకు బీ ఫార్మసీ చేయాలని ఉన్నా ఏమీ చేయలేక ఇంట్లో కూర్చుని ఉంది.
ఆరోగ్యశ్రీని తీసుకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల జాబితా నుండి చాలా వ్యాధులను తొలగించింది. పేదలు ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రులకే పోవాలట. చంద్రబాబు హయాంలో చేనేతన్నలు చనిపోతే వారికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. వారికి 312 కోట్ల రూపాయలు రుణమాఫీకని రాజశేఖర్ రెడ్డిగారు పక్కన పెట్టిపోతే ఇంతదాకా దానిని పూర్తిగా చెల్లించలేదు ఈ ప్రభుత్వం. నాలుగుశాతం రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీల పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డిగారు. ఈ ప్రభుత్వానికి ఒక్కరంటే ఒక్కరి మీద కూడా ప్రేమ లేదు. ఒక్క రాజన్న కుటుంబం మీద మటుకే కాకుండే ప్రజలందరి మీదా ద్వేషంతో కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు." అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
"చంద్రబాబు హయాంలో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్త పెన్షన్లు ఇచ్చేవారు. కానీ రాజశేఖర్ రెడ్డిగారు రూ.70ని రూ. 200 చేసి అడిగిన ప్రతివారికీ పెన్షన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బియ్యం కార్డులు ఉన్నవారి నుండి కార్డులు తీసేసుకుంటోంది ఈ ప్రభుత్వం. వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయిందని గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం చెవికెక్కదు. ఇలా రాజశేఖర్ రెడ్డిగారి ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. న్యాయంగా అయితే దీన్నంతా నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం. మూడేళ్లుగా టిడిపి చోద్యం చూస్తోంది. సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు నాటి ఎన్టీఆర్ ప్రధాన వాగ్దానాలైన రెండు రూపాయల కిలో బియ్యం, మద్యనిషేధం కార్యక్రమాలను నిలబెట్టుకోలేదు. చంద్రబాబుకు మాట ఇవ్వడమంటే ఏమిటో, మాట మీద నిలబడడం అంటే ఏమిటో ఈ జన్మకి అర్థం కాదు. చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో ప్రాజెక్టులు కడితే నష్టమనీ, వ్యవసాయం దండగ అనీ, ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదనీ రాసుకున్నారు...చంద్రబాబు హయాంలో విద్యుత్తు చార్జీల పెంపుపై ఆందోళన జరుగగా, పోలీసు కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలకు రాజశేఖర్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక నష్టపరిహారం ఇచ్చారు. కరెంటు బకాయిలూ మాఫీ చేశారు" అని షర్మిల గుర్తు చేశారు.

Back to Top