అమరావతి కోర్టు ఆదేశాల మేరకు మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్ తిప్పేస్వామి బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈమేరకు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పార్థసారథి, అంబటి రాంబాబు తోపాటు పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, తిప్పేస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాం ఇచ్చిన కారణంగా టిడిపికి చెందిన ఈరన్న ఎన్నికను కొట్టివేస్తూ, రెండో స్థానంలో ఉన్న తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.అనంతరం ఎమ్మెల్యే గా ప్రమాణం చేసిన అనంతరం డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ ఈ కేసులో న్యాయం గెలిచిందన్నారు. నాలుగున్నరేళ్ల పాటు న్యాయపోరాటం చేశామన్నారు. ముఖ్యమంత్రి సహా టిడిపి నాయకులు ఇచ్చిన ఏ హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. ముఖ్యంగా హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా మడకశిరకు నీళ్లిస్తామన్న హామీని విస్మరించారని, తన పదవీ కాలంలో ప్రభుత్వంపై పోరాటం చేసి, ప్రతి చెరువుకు నీళ్లు అందేలా చూస్తానన్నారు.పార్టీ అధ్యక్షులువైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతానన్నారు.