మే 4, 5వ తేదీల్లో మండలాధికారులకు వైఎస్సార్ సీపీ వినతిపత్రాలు

హైదరాబాద్: కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలనే డిమాండ్‌తో మే 4, 5వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలు, ఎండీవోలకు స్థానిక నేతలు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంటలు సర్వనాశనమై దుర్భర పరిస్థితుల్లో ఉన్న రైతుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న 10 జిల్లాల్లో 35 నుంచి 50 సెంటీమీటర్ల వరకూ తక్కువ వర్షం కురిసిందన్నారు. అనంతపురం, ఉత్తరాంధ్రలో జీవనోపాధి లేక బెంగళూరు, ఒడిశాకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా పరిశ్రమలు, పెట్టుబడులంటూ జపం చేస్తోందని విమర్శించారు. కరువు వల్ల పంట నష్టంపై సరైన అంచనాలే వేయలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన కరువు బృందం రాత్రి పూట టార్చ్‌లైట్ వెలుగులో రాయచోటి తదితర ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించిందన్నారు.

ధాన్యం సేకరణ విధానాన్ని మార్చటంతో రైతులు కనీస మద్దతు ధర కన్నా రూ. 100 నుంచి రూ. 150 తక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని టీడీపీ తుంగలోకి తొక్కిందని దుయ్యబట్టారు.
 
ప్రత్యేక హోదా బాధ్యత బీజేపీ, టీడీపీలదే
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదేనని మైసూరా పేర్కొన్నారు. ఒత్తిడి చేసి సాధించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరిగినపుడు తాము అధికారంలోకి రాగానే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ నేతలు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌ను ఆదుకోవాలని పార్టీ తరపున కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మైసూరా చెప్పారు. అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
Back to Top