కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయం సరైంది కాదు

హైదరాబాద్, 30 జూలై 2013:

కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవసం సరికాదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతాల్లోనూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయాలన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రజల పక్షాన ఉండే పార్టీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయించి, ప్రకటించిన అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అన్నారు.

రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయే మూడు ప్రాంతాల ప్రజలతో చర్చించేందుకు సరైన పరిష్కార ప్రతిపాదనతో కేంద్రం ముందుకు రావాలని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారంనాటి ప్రకటన కేవలం కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయమే కాని, కేంద్ర ప్రభుత్వానికి కాదన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అఖిలపక్ష సమావేశం జరిగిందని అందులో కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదన్నారు. తరువాత కేంద్ర హోంమంత్రుల సమక్షంలో రెండు సార్లు అఖిలపక్ష సమావేశాలు జరిగినా తన వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించని వైనాన్ని గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ రెండు విధాలుగా వైఖరి చెప్పినప్పుడు తాము నిలదీశామన్నారు.

ఇప్పటికైనా సిడబ్ల్యుసి నిర్ణయం ప్రకటించడం అంటే అది కాంగ్రెస్‌ వైఖరి కిందకి వస్తుందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగేళ్ళుగా తమ వైఖరి వివరించకుండా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం గాని, ఎఐసిసి గాని ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రంలోని స్టేక్‌ హోల్డర్లతో చర్చించాలని తమ పార్టీ ఇటీవలే కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో డిమాండ్‌ చేశామన్నారు. కానీ, ఈ రోజున యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడారే కానీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ట్రేడర్ల ఆర్గనైజేషన్లు, రైతు విభాగాలు ఎవరితోనూ మాట్లాడలేదని మైసూరారెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్‌ వైఖరే ప్రభుత్వం వైఖరి అన్నట్లు వ్యవహరించింది కానీ విభజన వల్ల నష్టపోయే ఏ సంస్థతోనూ మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఇరు ప్రాంతాలలోనూ ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రజా‌పక్షం కాబట్టి తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని మైసూరారెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top