ధర్నాల విజయవంతానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పిలుపు

హైదరాబాద్:

ప్రతిపాదిత విద్యుత్తు చార్జీల పెంపుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పిలుపునిచ్చారు.  హైదరాబాద్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు చార్జీల పెంపును ప్రతిపాదించడం ప్రభుత్వ వైఖరినీ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోని సబ్ స్టేషన్ల వద్ద తమ పార్టీ ధర్నా నిర్వహిస్తుందన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి విద్యుత్తు వినియోగదారులపై సుమారు 15వేల కోట్ల రూపాయల భారాన్ని మోపాలని చూస్తోందన్నారు. ఇప్పటికే విద్యుత్తు వినియోగంపై ఇంధన సర్చార్జి సర్దుబాటు రూపంలో భారం వేసిందన్నారు.  విద్యుదుత్పాదన పెంచడం, లేదా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం  వంటి చర్యలు చేపట్టకుండా సులువైన ధరల పెంపు పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తాము చేపడతున్న ఆందోళన కార్యక్రమానికి పార్టీ భేదం లేకుండా ప్రజలు పాల్గొనాలని జూపూడి కోరారు.

మహానేత మాదిరిగా పాలించడంలో విఫలం

     మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎంలు ఆయనలాంటి పాలన అందించడంలో విఫలమయ్యారని జూపూడి చెప్పారు. ప్రజల మనోభావాల్ని మన్నించడంలో కానీ, డాక్టర్ వైయస్ఆర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కానీ  విఫలమయ్యారని ఆరోపించారు.   వైయస్ఆర్ కాంగ్రెస్ మీద భౌతికంగా, మానసికంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిరంతరం ధరలు పెంచుతున్నారనీ, ఈ విషయంలో  దేన్నీ వదలడం లేదని తెలిపారు. నాడు రోశయ్య, నేడు కిరణ్‌కుమార్ రెడ్డి నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ రైతులు, కార్మికులు ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా చార్జీలు పెంచేశారన్నారు. పెంచకపోతే ప్రభుత్వాన్ని నడపలేమన్న స్థితికి వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు  పథకంలో కనీసం మూడు గంటలు కూడా సరఫరా ఇవ్వడం లేదన్నారు. పెంచకపోతే పరిపాలించే పరిస్థితి లేదనీ,  భరించాల్సిందేననీ అంటున్నారని జూపూడి చెప్పారు.  2004కు పూర్వం ఈ రాష్ట్రం ఎలా ఉందో ఆ స్థితికి తీసుకెడుతున్నారని మంత్రులే అంటున్నారనీ, ప్రజల చేత ఛీకొట్టించుకుంటున్నారనీ పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు భారం వేసే ప్రయత్నాన్ని తమ పార్టీ  ఖండిస్తోందన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రం కుదేలైపోయిందనీ, ఇండస్ట్రియల్ బెల్టుకు నలబై శాతం కూడా కరెంటు అందడం లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రంగంలోకి ఎందుకొచ్చామా అనుకుంటూ పారిశ్రామికవేత్తలు తమ యూనిట్లను మూసివేస్తున్నారని చెప్పారు.  కరెంటు ఉత్పత్తికి ఎన్నో అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వం వాటిని గాలికొదిలేసిందన్నారు. పైపెచ్చు ప్రశ్నించిన వారిమీద కేసులు పెడుతోందని చెప్పారు. ఈ వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడతామన్నారు. ప్రతిపక్షం పట్టించుకోనప్పటికీ రాజశేఖరరెడ్డి గారి అనుచరులుగా ఈ అంశంపై ఉద్యమిస్తామని చెప్పారు. బుధవారం నాటి ధర్నాలో ప్రజలు శాంతియుతంగా  పాల్గొని  నిరసన తెలపాలని కోరారు.

మహానేత వారసులైతే ప్రజలపై భారం మోపుతారా

     ప్రస్తుత కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నట్లు వారు డాక్టర్ రాజశేఖరరెడ్డి వారసులైతే రైతుకు కరెంటు చార్జీలు ఎందుకు పెంచారని జూపూడి  ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రంలో 50 శాతం మించి చార్జీలను పెంచలేదనీ, పైగా అక్కడ పరిశ్రమలకు డెబ్బై శాతం విద్యుత్తును ఇస్తున్నారనీ తెలిపారు. మన రాష్ట్రంలో డెబ్బై శాతం విద్యుత్తు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజశేఖరరెడ్డి గారి వారసుడు జగన్ కాదు మేము అని చెప్పుకుంటున్నవారు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారనీ,  ఈ పాలనకు తెరదించడానికి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని  ఎదురుచూస్తున్నారనీ ఆయన తెలిపారు. మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి తన పాలనలో చార్జీలను పెంచనే లేదన్నారు. ఒకవేళ కేంద్రం పెంచితే దానిని రాష్ట్రమే భరించేలా నిర్ణయం తీసుకుని ప్రజలపై భారం పడకుండా చూసేవారని గుర్తుచేశారు. భారాన్ని ప్రజలు తట్టుకోలేరన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసింది భారం మోపించుకోవడానికి కాదని జూపూడి చెప్పారు. ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను తమ పార్టీ  తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఆయన వ్యాఖ్యల వెనుక వైయస్ఆర్‌ కాంగ్రెస్  ఉందని కొంతమంది కావాలనే
ప్రచారంచేస్తున్నారన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

Back to Top