టీడీపీ రౌడీయిజం..ప్రమాదంలో ప్రజాస్వామ్యం

వైయస్‌ఆర్‌ జిల్లా:  ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ప్రజాస‍్వామ్యం ఖూనీ అయిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని పోలీసులు చూస్తు ఉండిపోయారని ఎమ్మెల్యే రాచమల్లు ఆవేదన వ్యక‍్తం చేశారు. ఒక్కో కౌన్సిలర్‌ను రూ.50 లక్షలకు కొనేందుకు జిల్లా మంత్రి సిద్ధపడ్డారని ఆరోపించారు. అయితే ఆ ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగకపోవడంతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో టీడీపీ నేతలు రౌడీయిజం చేశారని, తమపై దాడికి యత్నించారన్నారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని రాచమల్లు అన్నారు. టీడీపీ  నేతల పన్నాగాలు తీవ్రంగా బాధించాయని, ప్రజాస్వామ‍్యం ఏమవుతుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు.

కాగా అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వరుసగా రెండోరోజూ (ఆదివారం) కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్‌ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా నిన్న కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు.
Back to Top