చంద్రబాబు అసమర్థత వల్లే మరణాలు

విజయవాడ: ప్రభుత్వ అసమర్ధత వల్లే రాష్ట్రంలో మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. మొగల్తూరులో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందినా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి విచ్చల విడిగా ఫ్యాక్టరీలకు పర్మీషన్లు ఇవ్వడం వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయన్నారు. పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి బలైతే ఇప్పటి వరకు చార్జ్‌షీట్‌ కూడా ఫైల్‌ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 


అసెంబ్లీలో ప్రతిపక్షం వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితుల్లో లేదని దుయ్యబట్టారు. మొగల్తూరు ఆక్వాఫుడ్‌లో 5 మంది కార్మికుల మరణానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. తుందుర్రు ఫ్యాక్టరీకి పైపులైన్‌ వేస్తామని గత రివ్యూ మీటింగ్‌లో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగైనా పైపులైన్‌ పడిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, పొల్యూషన్‌ డిపార్టుమెంట్‌ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు రిపీట్‌ అవుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఇలాంటి కంపెనీలకు పర్మీషన్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
Back to Top