ఎక‌రం, రూ. 20 కోట్లు ఆఫ‌ర్‌

విశాఖ‌ప‌ట్నం:  సీఎం చంద్ర‌బాబు ప్రోత్సాహంతో ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌, ఎంపీ సీఎం ర‌మేష్ ప్ర‌లోభాల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నార‌ని మాడుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూడి ముత్యాల‌నాయుడు ఆరోపించారు. విశాఖ న‌గ‌ర పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడారు. తండ్రి, కొడుకులు త‌న‌నూ ప్ర‌లోభ పెట్టార‌ని, టీడీపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు ఫిరాయింపుల‌కు బ్రోక‌రేజ్ చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. రాజ‌ధాని ప్రాంతంలో ఎక‌రా భూమి, రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వ‌ర‌కు డ‌బ్బు, పెద్దఎత్తున కాంట్రాక్టులు ఇప్పిస్తామ‌ని ఎర వేశార‌ని ఆయ‌న వివ‌రించారు.
 తిరుగులేని నాయ‌క‌త్వ ప‌టిమ క‌లిగిన వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ప్ర‌స్తుతం తాను నిజాయితీ క‌లిగిన ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లో ఉన్నాన‌ని తెలిపారు. వారి ప్రలోభాల‌కు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా మిగిపోతాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు కూడా ఎంపీల నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ని... తాము చెప్పిన ప్యాకేజీలు న‌చ్చ‌క‌పోతే కావాల్సిన‌వి చెప్పుకునేందుకు లోకేష్‌తో భేటీ ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని చెప్పారు. తాను వారిని ఒక్క‌టే అడిగాన‌ని, లోకే్ష్ వాళ్ల నాన్న కూర్చీ నాకు ఇవ్వ‌గ‌ల‌డా...? ఇస్తానంటే అప్పుడు ఆలోచిస్తా అని చెప్ప‌గానే ఫోన్ క‌ట్ చేశార‌ని... ఆ రోజు నుంచి మ‌ళ్లీ ఫోన్లు రాలేద‌న్నారు. ప్ర‌లోభాల‌కు లొంగి టీడీపీలోకి రావ‌ద్ద‌ని ఆ పార్టీకి చెందిన ఒక స‌ర్పంచ్ త‌న‌కు స‌ల‌హా ఇచ్చార‌ని, అంటే చంద్ర‌బాబును ఆ పార్టీ నేత‌లు ఎంత‌లా అస‌హ్యించుకుంటున్నారో దాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంద‌ని ముత్యాలనాయుడు అన్నారు.
 బాబు అండ‌తో బాక్సైట్ గ‌నులను త‌వ్వుకోవ‌చ్చ‌న్న ఆశ‌తో అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు టీడీపీలో చేరితే... ఏజెన్సీలో వైఎస్సార్‌సీపీ ఖాళీ అయిపోయింద‌ని పత్రిక‌ల్లో క‌థ‌నాలు రాయించుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. చంద్ర‌బాబుకు స‌వాల్ విసురుతున్నా...మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కిడారితో క‌లిసి అర‌కులో నువ్వు స‌భ పెట్టు... అదే రోజు మేము అక్క‌డే మా జ‌గ‌న్‌తో స‌భ పెడ‌తాం.... గిర‌జ‌నం ఎవ‌రి వెంట ఉన్నారో తేలిపోతుంద‌న్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ 150 ఎక‌రాల కోసం టీడీపీలో చేరార‌ని విమ‌ర్శించారు. 
Back to Top