<br/> <br/>తూర్పు గోదావరి: రాజధాని రైతులకు న్యాయం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని సీఆర్‌డీఏ రైతులు పేర్కొన్నారు. బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు కుయ్యేరు వద్ద కలిశారు. ల్యాండింగ్ పూలింగ్ పేరుతో బెదిరింపులకు పాల్పడి, ఇప్పటికే తమ దగ్గర నుంచి 54 వేల ఎకరాలు లాక్కున్నారని రైతులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. భూమి ఇవ్వకుంటే లాండ్ అక్విజేషన్ కింద తీసుకుని స్వచ్చందంగా ఇచ్చినట్టు ప్రకటిస్తామని బెదిరిస్తున్నారని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు రుణాలు, సబ్సిడీలు, నీరు రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని సీఆర్డీఏ రైతులు తెలిపారు. సేకరించిన 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి కావాల్సింది 900 ఎకరాలు మాత్రమేనని వివరించారు. ఇప్పటికీ ఒక్క నిర్మాణం చేపట్టకుండా భూముల కోసం తమని వేధించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అందుకే తమ సమస్యలు చెప్పుకునేందుకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసినట్టు రైతులు తెలిపారు.