కాంగ్రెస్‌కే జగన్ అవసరం: ఎంపీ సబ్బం హరి

కాంగ్రెస్ పార్టీకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అవసరముంటుందని ఎంపీ సబ్బం హరి అన్నారు. జగన్‌కు కాంగ్రెస్‌తో ఎటువంటి అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు చెప్పడాన్ని చంద్రబాబు తప్ప అన్ని జాతీయస్థాయి పార్టీలూ గౌరవిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలో గురువారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి వచ్చిన ఆయన విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రణబ్‌కు జగన్ మద్దతు పలకడం వల్ల కాంగ్రెస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలీనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించడాన్ని హరి ఖండించారు.

జగన్ నిర్ణయంపై ఎన్డీఏ కన్వీనర్ శరద్‌యాదవ్,మాయావతి, ములాయంసింగ్ యాదవ్, మమతా బెనర్జీ తదితర నేతలతోపాటు జాతీయ మీడియా, జగన్‌ను వ్యతిరేకించే మీడియా సైతం అభినందిస్తుంటే, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ వాళ్లు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ఏ పనిచేసినా దాన్ని వ్యతిరేకించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించడం వల్ల మొన్నటి ఎన్నికల్లో రెండూ మూడు స్థానాలకు పడిపోయారని, ఇదే పరిస్థితి కొనసాగితే డిపాజిట్లు కోల్పోయే స్థానానికి చేరుకుంటారన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించే స్థితిలో లేరని చెప్పారు. జగన్ సీఎం కావాలన్న ప్రజల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం వహించేవారు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

తాజా వీడియోలు

Back to Top