కాంగ్రెస్, టీడీపీలు చర్చ కోరడం వెనుక కుట్ర

హైదరాబాద్ :

టీ ముసాయిదా బిల్లుపై ఇప్పటి వరకూ విభిన్న వాదనలు వినిపించిన కాంగ్రెస్, టీడీపీల్లోని ఇరు ప్రాంతాల నేతలు హఠాత్తుగా చర్చ జరగాలని కోరడం వెనక కుట్ర దాగి ఉందని వైయస్ఆర్‌ సీఎల్పీ ఆరోపించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ నేతలు కోరుతున్నట్టుగానే విభజన బిల్లుపై చర్చ జరగాలని సీమాంధ్ర టీడీపీ, కాంగ్రె‌స్ నేతలు కూడా కోరడంలోని మతలబు ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం బుధవారంనాడు పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జయప్రకాశ్ నారాయణ ఒకే మాటపై ఉండి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ నాయకుల కుట్రపూరిత మాటలు విని మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విభజన ద్రోహుల ఎత్తుగడలు ఎలాంటివో, వీరి కుమ్మక్కు రాజకీయాలు ఎలా ఉన్నాయో అసెంబ్లీ వేదికగా సభ్య సమాజం తెలుసుకుంది అని విమర్శించారు. అసెంబ్లీ ఎలాంటి తీర్మానమూ చేయకుండానే సంప్రదాయాలకు, రాజ్యాంగ పద్ధతులకు విరుద్ధంగా సభలో విభజన బిల్లు పెట్టడాన్ని, చర్చను ప్రారంభించడాన్ని తమ పార్టీ ఖండిస్తున్నదన్నారు. విభజన బిల్లుపై ఓటింగ్ జరిపితే తప్ప చర్చకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top