<strong>హైదరాబాద్, 2 డిసెంబర్ 2012:</strong> నిబంధనలకు విరుద్ధంగా సీఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కె. చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శాసనసభ కొత్త నిబంధల ప్రకారం సభ్యులు కాని వారు సభ ప్రాంగణంలో మీడియా సమావేశాలు నిర్వహించకూడదు. సభ ముగిసిన 20 నిమిషాల తరువాత మాత్రమే ఆయా పార్టీల శాసనసభాపక్ష కార్యాలయాల్లో విలేకరుల సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది. <br/>శాసనసభ సమావేశం జరుగుతుండగా, అందులోనూ అత్యంత ముఖ్యమైన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే విషయం చర్చిస్తుండగా చిరంజీవి సిఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించడమేమిటని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులు అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద నిలదీశారు. నిబంధనలను ఉల్లంఘించి చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించడం ఎంతవరకు సబబు అని వారు ఆ ఫిర్యాదులో ప్రశ్నించారు.<br/>నిబంధనల ప్రకారం సభ ముగిసేవరకు అసెంబ్లీ ఆవరణలోకి, పార్టీ కార్యాలయాల్లోకి ఫోటోగ్రాఫర్లను, కెమెరామెన్‌ను అనుమతించ కూడదు. సీఎల్పీ కార్యాలయంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతుండగానే విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభమైనట్టు సూచిస్తూ గంట మోగినా ఇదేమీ పట్టించుకోకుండా చిరంజీవి ప్రసంగం కొనసాగించడం వివాదాస్పదంగా మారింది. <br/>శాసన సభ్యుడు కాని చిరంజీవి సిఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించడానికి ఎలా అనుమతించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అని వారు నిలదీశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చిరంజీవి క్షమాపణ చెప్పేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్ సిపి సభ్యులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.