దోపిడీకి చెక్‌

కదిరి: అభివృద్ది ముసుగులో ప్రజా సొమ్మును స్వాహా చేయాలన్న మున్సిపల్‌ పాలక వర్గానికి వైయస్సార్‌సీపీ కౌన్సిలర్లు చెక్‌పెట్టారు. ఇందుకు  ‘దోపిడీకి అజెండా రెడీ’ అన్న ఓ పత్రిక కథనం శనివారం జరిగిన కౌన్సిల్‌ను కుదిపేసింది. దోపిడీకి సంబందించిన అంశాలన్నింటినీ మెజార్టీ కౌన్సిలర్ల ఆమోదం మేరకు రద్దు చేయక తప్పలేదు. అసలే కదిరి మున్సిపాలిటీ పీకల్లోతు కష్టాల్లో ఉంటే మొక్కలకు ట్రీ గార్డుల పేరుతో రూ4.80 లక్షలు మింగేసేందుకు మీకు మనసెలా ఒప్పుతోందని వైయస్సార్‌సీపీ కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, కిన్నెర కళ్యాణ్, ఖాదర్‌బాషా, జిలాన్‌ ప్రశ్నించారు. పట్టణంలో పార్కులు లేకుండానే వాటి నిర్వహణ కోసమని రూ1.50 లక్షలు కావాలని చెబుతారా? ప్రజల సొమ్ము ఇలా వృధా చేయడం మీకు సిగ్గుగా లేదా? అని మండిపడ్డారు. 

 పార్నపల్లి రిజర్వాయర్‌దగ్గర నుండి మంచినీటి సరఫరాను పరిశీలించేందుకు చైర్‌పర్సన్‌కు, కమిషనర్‌కు, సిబ్బందికి ఇలా వేర్వేరుగా 3 వాహనాలకు రూ10.50 లక్షలు కావాలని కౌన్సిల్‌ముందు పెట్టిన అంశం దుమారం రేపింది. వాహనాల పేరుతో జేబులు నింపుకోవడానికే అన్నట్లు ఉందని వైయస్సార్‌సీపీతో కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. వీధిలైట్ల మెయిన్‌టెనెన్స్‌పేరుతో రూ3 లక్షల ఖర్చు చేయడానికి కౌన్సిల్‌ ఆమోదం కోరారని, అయితే మెయిన్‌టెనెన్స్‌బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాము కదా..మళ్లీ ఈ దందా ఏంటి? అని వైయస్సార్‌సీపీ కౌన్సిలర్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. 

Back to Top