అవినీతి, అక్రమాలతో విరాజిల్లుతున్న బాబు పాలన

  • మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలు ఒక్కటైనా నెరవేర్చావా..?
  • అవినీతి రహిత పరిపాలన అనడం ఒక బూతు
  • విశాఖ లక్షల కోట్ల భూముల కుంభకోణంలో చంద్రబాబు
  • టీడీపీ ధనార్జన పథకంగా ఇసుక మాఫియా
  • మహానాడు వేదికగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు
  • వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ 
హైదరాబాద్‌: చంద్రబాబు మూడేళ్ల పరిపాలన అవినీతి, అక్రమాలతోనే విరాజిల్లుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సుమారు 12 ప్రధానమైన అంశాలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రుణమాఫీ, పంట నష్ట నివారణ, ప్రకృతి వైపరిత్యాలకు ఇన్సూరెన్స్, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణమాఫీ, ఒక్కో సోసైటీకి లక్షా 50 వేల ఇళ్లు, ఎన్టీఆర్‌ సుజల పథకం, బీసీలకు బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్ల కేటాయింపు, అవినీతి రహిత పరిపాలన, శాంతిభద్రతలు అని గొప్పగా చెప్పిన చంద్రబాబు వీటిల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఒక్క అంశాన్ని నెరవేర్చకపోగా విశాఖలో జరుగుతున్న మహానాడులో పథకాలన్నీ అమలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. 

అదనంగా ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదు
అధికారంలోకి రాగానే వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయాడని బొత్స అన్నారు. మొదట్లో రుణాలు మొత్తం మాఫీ అని, తరువాత కమిటీ వేసి రూ. 1.5 లక్షలు మాత్రమే అని మాట మార్చాడన్నారు. రూ. 25 వేల కోట్ల మాఫీ చేశామంటున్నారు కానీ ఇవాళ్టికి బడ్జెట్‌ నుంచి కేటాయించింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమేనని, అధనంగా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతున్నారు. ఏ మేరకు రుణమాఫీ అయ్యిందో మహిళలు ఆలోచించుకోవాలన్నారు. 

గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు
రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఎక్కడ చేశారని బొత్స చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర కల్పిస్తున్నామా అని చంద్రబాబు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నామన్నారు. 

మచ్చుకైనా ఒక్క ఇళ్లుందా...?
ఎక్కడ వేసి గొంగడి అక్కడి అన్న మాదిరిగానే చంద్రబాబు ఇళ్ల నిర్మాణం తయారైందన్నారు. ఒక్కో సోసైటీకి లక్షా 50 వేల ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రతీ గ్రామానికి తారురోడ్డు వేస్తామన్నారు. మూడేళ్ల పరిపాలనలో కనీసం ఒక్క ఇల్లు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. ఒక్క గ్రామానికైనా మంచి రోడ్డు నిర్మాణం చేపట్టారా అని చంద్రబాబును నిలదీశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ చంద్రబాబు కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. 

ఎక్కడుంది ఎన్టీఆర్‌ సుజల పథకం?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుమీద చేపట్టిన పథకాన్ని కూడా చంద్రబాబు నీరుగార్చారని బొత్స ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ సుజల పథకం పేరుతో రూ. 2కే 20 లీటర్ల నీరు ఇస్తామన్నారు. ఆ పథకం ఎక్కడుంది... ఎక్కడ అమలవుతుందో చంద్రబాబు చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో పెట్టిన పథకాన్ని కూడా అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని బొత్స ఆరోపించారు. 

బీసీలకు రూ. 10 వేల కోట్లు ఎక్కడా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌కు మాత్రమే వాడుకుంటున్నాడని బొత్స మండిపడ్డారు. అధికారంలోకి రాగానే బీసీలకు బడ్జెట్‌లో నుంచి సుమారు రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామన్నాడు. ఇప్పటి వరకు పైసా కేటాయించాడా అని ప్రశ్నించారు. కనుచూపు మేరల్లో ఎక్కడైనా ఆ బడ్జెట్‌ కనిపిస్తుందా అని బీసీలను అడిగారు. చంద్రబాబు చర్యల వల్ల బీసీలు మోసపోవాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదేనా అవినీతి రహిత పరిపాలన
అవినీతి రహిత పరిపాలన అని చంద్రబాబు అనడం ఒక బూతు అని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. విశాఖలో లక్షల కోట్లకు సంబంధించిన భూమలు కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపణలు వచ్చినా అధికారులపై చర్యలు తీసుకున్నారు తప్ప నాయకులపై ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎక్కడైతే టీడీపీ మహానాడు జరుగుతుందో.. ఆ ప్రాంతంలోనే ఇలాంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయన్నారు. విశాఖలో ఒక లారీ ఇసుక సుమారు రూ. 25–30 వేలు ఉందన్నారు. ఉచితంగా ఇస్తున్నామని చెబుతుంటే ఇంత ధర ఎందుకు పెరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ధనార్జన పథకంగా ఇసుక మాఫియా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పేరు అవినీతి రహిత పరిపాలన అని ఎద్దేవా చేశారు. మహానాడులో ఆత్మస్తుతి కోసం గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. కలెక్టర్‌ల సమీక్షలో మా ఊరులో నా చేతుల మీదుగా ప్రారంభించిన ఆసుప్రతిలో డాక్టర్లు లేరని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నీ ఊర్లనే డాక్టర్లు లేరంటే  పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడా కనిపించడం లేదు. 108 అంబులెన్స్‌లు ఎక్కడికక్కడ డిజిల్‌ లేక ఆగిపోతున్నాయి. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్నారు. బాబు వస్తే జాబ్‌ అన్నారు. ఉద్యోగం లేదు... భృతి లేదు అని దుయ్యబట్టారు. 

శాంతిభద్రతలు 
బీహార్‌లో ఉండే భయాందోళన పరిస్థితులు నేడు ఆంధ్రరాష్ట్రంలో ఉన్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డు మీద మర్డర్‌లు. తెలుగుదేశం పార్టీ నేతలు కానిస్టేబుల్స్‌ను కొడుతున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లను కింద కూర్చోబెడుతున్నారు. డీఎస్పీల చొక్కాలు పుచ్చుకుంటున్నారు. ఐజీలను నిర్భందిస్తున్నారు. ఇదేనా చంద్రబాబు నువ్వు రాష్ట్రంలో అమలు చేసే శాంతిభద్రతలు అని ప్రశ్నించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top