అరచేతిలో స్వర్గం చూపారుగవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అవాస్తవాలే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిఅమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కొత్త అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా అరచేతిలో బ్రహ్మాండంగా స్వర్గం చూపారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభివర్ణించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని చూశామని, ఒక ఐపీఎస్ అధికారి అయిన గవర్నర్‌తో చంద్రబాబు అబద్ధాలు, అవాస్తవాలను, ఈ అనైతిక పాలన గురించి చెప్పించారని మండిపడ్డారు. గవర్నర్ తన ప్రసంగం సమయంలో పడ్డ ఇబ్బందులు, అవస్థలు, ఆపసోపాలు మాకు అర్థమయ్యాయన్నారు. ఇన్ని అబద్ధాలు నావల్ల అవుతాయా అని గవర్నర్ తన ప్రసంగ సమయంలో నాలుగు సార్లు నీళ్లు తాగారని అన్నారు. గవర్నర్‌ను చూసి మాకే జాలి కలిగిందని, అంత పెద్దాయన అబద్ధాలు చెప్పలేక ఎంత ఇబ్బందులు పడ్డారో చూశామన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్కటి కూడా వాస్తవానికి దగ్గరలో లేవన్నారు. అన్ని సత్యదూరమైనవే, అభూత కల్పనలే అన్నారు. తిరుమలలో కూడా ఇలాంటి వైకుంఠం ఉండదని చెప్పారు.
ఆ ఘనత బాబుదేబాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన చంద్రబాబు తన కుటుంబంలోనే ముగ్గురికి ఉద్యోగాలిచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. సీఎంగా తొలి సంతకం చేసిన రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంశాలు గవర్నర్ ప్రసంగంలో కనిపించలేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నది ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం కాలేదని విమర్శించారు. ఒకే ఇంట్లో మూడు ఉద్యోగాలైతే ఇచ్చారని, చంద్రబాబు, బాలయ్య బాబు, లోకేష్ బాబులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఇక ఆ ఇంట్లో మిగిలింది బుల్లిబాబు దేవాన్ష్ ఒక్కరే అన్నారు. ప్రత్యేక హోదా అంశం ఎక్కడా కూడా ప్రస్తవనకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ఇవ్వకుంటే ఊరుకోను అన్న చంద్రబాబు ఈ రోజు ఆ అంశం ఏమైందని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలే అని ఫైర్ అయ్యారు.
గవర్నర్ ప్రసంగమంతా అబద్దాలేనూతన భవనంలో మారని బాబు వైఖరివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డివెలగపూడి: నూతన అసెంబ్లీ భవనంలో కూడా చంద్రబాబు తన తీరు మార్చుకోలేదని, మూడేళ్లుగా ఎలాంటి అసత్యాలు గవర్నర్‌తో ప్రకటించారో అదే విధంగా నూతన అసెంబ్లీ భవనంలో కూడా గవర్నర్ నోట అసత్యాలు పలికించారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వెన్నుపోటుతో అబద్దాలు పలికించారని మండిపడ్డారు. నూతన అసెంబ్లీ భవనంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సీఎం పదవి కోసం సొంత పిల్లనిచ్చిన మామను ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అదే రీతిలో వెన్నుపోటును ఆయుధంగా చేసుకొని ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఉపయోగం లేదంటూ గవర్నర్ చేత అబద్దాలు మాట్లాడించి బాబు రాష్ట్ర ప్రజానికానికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఏడుకొండల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చిన వ్యక్తి దగ్గరుండి ప్రత్యేక హోదాను మంటగలుపుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దుయ్యబట్టారు. నిసిగ్గుగా బరితెగించి ప్రత్యేక హోదాకు చరమగీతం పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ నుంచి రాజధాని నిర్మాణం వరకు పూర్తి అస్పష్టతతో గవర్నర్ ప్రసంగం సాగిందన్నారు.
పారిశ్రామిక సదస్సులు పెట్టి ఎన్ని ఉద్యోగాలిచ్చావ్ బాబూపారిశ్రామిక సదస్సులు నిర్వహించి రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబుడులు వచ్చాయని చంద్రబాబు గొప్పగా చెప్పారు... లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చివుంటే ఎంత మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చాయని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాబును సూటిగా ప్రశ్నించారు. మరి గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగాల సంఖ్య ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దివంగత నేత ఎన్టీఆర్ పేరుతో సృజల స్రవంతి అని పథకం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో ఎన్టీఆర్ నీళ్ల పథకంపై కూడా స్పష్టత లేదన్నారు. కరువుతో రాష్ట్ర ప్రజానికం, రైతాంగం అల్లాడుతుంటే మీకు వృద్ధిరేటు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన అసెంబ్లీ సమావేశంలో దృష్ట సాంప్రదాయాలతో అబద్దాలతో గవర్నర్ ప్రసంగం కొనసాగిందన్నారు.
బాబు నేరాలకు సుప్రీం చరమగీతం పాడుతుందితాత్కాలిక అసెంబ్లీ వాస్తు ప్రభావమో ఏమో గానీ తొలి అసెంబ్లీ సమావేశం రోజే ముఖ్యమంత్రికి ఊహించని షాక్ తగిలిందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి చంద్రబాబుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసిందని స్పష్టం చేశారు. జార్ఖాండ్ ముఖ్యమంత్రి ఏ విధంగా జైలుకు వేళ్లారో అదే చట్టం కింద వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్ల కేసుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారని చెప్పారు. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి అలవాటు ప్రకారం ఓటుకు కోట్ల కేసులో కూడా స్టే తెచ్చుకున్నాడన్నారు. హై కోర్టు స్టే ఇచ్చాక అంతా అయిపోయిందనుకొని చంద్రబాబు సంబరాలు చేసుకునే సమయంలో అత్యున్నత న్యాయస్థానం కేసులో వివరణ ఇచ్చుకోవాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఓటుకు డబ్బులు ఇవ్వడం తప్పుకాదన్న టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడేం మాట్లాడుతారని నిలదీశారు. స్టేలు తెచ్చుకొని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న చంద్రబాబుకు సుప్రీం కోర్టు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు.