ప్రయివేటీకరణపైనే బాబుగారికి మోజు

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిపై త్వరలో వేటు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రయివేటీకరణంటే ఎంత మోజో చెప్పలేం. ఆయన హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. అవన్నీ అయినవారికి... అయినకాడికి.. అనుకోండి. అది వేరే విషయం. ఇపుడు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరలా తన పాత బాణీని అమలు చేసే పనిలో బిజీ అయిపోయారు. తన సొంత జిల్లా చిత్తూరునే అందుకు ఎంచుకోవడం గమనార్హం. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చిత్తూరులోని విజయా డైరీ మూతపడింది. ఆ తర్వాత చిత్తూరు సుగర్స్ను మూతపడేలా చేశారు. ఇపుడు చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని ప్రయివేటు పరం చేసేందుకు చంద్రబాబు సర్వం సిద్ధం చేశారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగించడానికి చంద్రబాబు సర్కారు ఏర్పాట్లన్నీ చకచకా చేసేస్తోంది. ప్రభుత్వాసుపత్రిని అపోలో సంస్థలు ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి క్లినికల్ అటాచ్మెంట్ ఇవ్వాలని ఆ సంస్థ అడగ్గానే చంద్రబాబు ప్రభుత్వం తలూపేసింది. 17 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన ఈ ప్రభుత్వాసుపత్రిలో 300 పడకలున్నాయి. రోజుకు వెయ్యిమందికిపైగా ఔట్పేషెంట్లు వైద్యం అందుకుంటారు. ఇపుడు ఈ ఆసుపత్రిలోకి ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షణ వైద్యులు ప్రవేశిస్తారు. రోగుల జబ్బులపై ప్రయోగాలు చేయడం, పోస్టుమార్ట్టం గదిలో మృతదేహాలకు శవపరీక్షలు చేసి శిక్షణ పొందడం లాంటివి చేస్తారు. ప్రభుత్వాసుపత్రిని అపోలోకు అప్పగిస్తే ఇక పేదలకు వైద్య సేవలు అందే పరిస్థితి ఉండదని, ఉద్యోగులు, యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఈ ఆసుపత్రి అపోలో చేతుల్లోకి వెళితే వైద్య సేవల కోసం వచ్చే పేదల నుంచి ముక్కుపిండి ఫీజులు, యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. టెస్ట్ల కోసం అధిక ఫీజులు వసూలు చేస్తారు. ప్రభుత్వాసుపత్రి ప్రయివేటు సంస్థ చేతుల్లోకి వెళితే తమకు ఇక వైద్యం కలలోని మాటేనని పేద, మధ్యతరగతి రోగులు ఆందోళన చెందుతున్నారు.

Back to Top