జగన్‌ను విమర్శించడానికి బాబుకు సిగ్గులేదా?

హైదరాబాద్:

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేసి, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, సుశీల్ కుమా‌ర్ షిండేలను ‌టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పల్లెత్తుమాట అనకుండా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పైనే ఎందుకు బురద చల్లుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రశ్నించారు.‌ శ్రీ జగన్‌కు ఉన్నంత దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అన్నారు. శ్రీ వైయస్ జగ‌న్‌ను విమర్శించడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? అని దాడి నిలదీశారు. తెలుగుజాతి రెండు ముక్కలు కావడానికి కారకుడు చంద్రబాబు అని దాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో దాడి వీరభద్రరావు మాట్లాడారు.

సోనియా గాంధీ దుర్మార్గంగా చేసిన అడ్డగోలు విభజన కారణంగా ‘మన బతుకులేం కావాల’ని రాష్ట్ర ప్రజలంతా  బాధపడుతుంటే వారిని ఓదార్చాల్సిన సమయంలో కూడా శ్రీ జగన్‌ను విమర్శించడమే చంద్రబాబు తన పనిగా పెట్టుకున్నారంటూ ఆయన ఎండగట్టారు. తప్పులన్నీ చంద్రబాబు చేసి ఆ నెపాన్ని వైయస్‌ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌పై మోపడం సరి కాదన్నారు.

కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకొని సీమాంధ్ర‌కు తీరని ద్రోహం తలపెట్టాయని దాడి మండిపడ్డారు. ‘సీమాంధ్రకు రాజధాని ఎక్కడో తెలియదు. నిర్మాణానికి ఎంతిస్తారో చెప్పలేదు. వారు చెప్పే మాటలకు చట్టబద్ధత కూడా లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అన్యాయంగా కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తుంటే టీడీపీ కూడా వారి అడుగులకు మడుగులు ఒత్తడం చాలా బాధాకరమన్నారు. రాజధానికి లక్ష కోట్ల రూపాయలు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపరేం? అని ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు టీడీపీని స్థాపిస్తే, అదే తెలుగుజాతి విధ్వంసానికి టీడీపీ పాటుపడటం దౌర్భాగ్యకరమన్నారు. తెలుగుజాతి విచ్ఛిన్నానికి కారణమైన చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు.

తెలంగాణకు ‌కేసీఆర్ ఫాద‌ర్ అయితే, ‌చంద్రబాబు గ్రాండ్ ఫాద‌ర్ అని‌ దాడి వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు అర్హులు కారన్నారు. ఆ పార్టీ పేరును తెలంగాణ పేరుగా చార్చుకుని  అధ్యక్షునిగా ఉండమని దాడి వీరభద్రరావు సలహా ఇచ్చారు.

Back to Top