చంద్రబాబూ... మీ కుట్ర సుస్పష్టం

హైదరాబద్, 8 డిసెంబర్ 2012:

దేశంలో కోట్ల మంది జీవితాల మీద వేటు వేసే అవకాశం ఉన్న రిటెయిల్‌లో ఎఫ్‌డీఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంటే, ముగ్గురు టీడీపీ ఎంపీలు గైర్హాజరు కావడం వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్ర ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మేకతోటి సుచరిత అన్నారు.  యూపీఏని గట్టెక్కించటానికి టీడీపీ వేసిన ఎత్తుగడ, కుమ్మక్కు రాజకీయాలపై ఆమె శనివారంనాడు బహిరంగ లేఖ విడుదల చేశారు.

     రాష్ట్ర శాసన సభ గత వారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి చర్చిస్తున్నప్పడు రెండు పార్టీలూ ఇలాగే కలిసి ఒక డ్రామా ఆడాయని సుచరిత లేఖలో పేర్కొన్నారు. ఎస్సీలను విడగొట్టాలన్న దురాలోచనతో జరుగుతున్న కుట్రల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు ఇద్దరు కూడా కుమ్మక్కై, ఒక పథకం ప్రకారం రచించిన డ్రామా అసెంబ్లీలో కనిపిందన్నారు. ఎస్సీలలో ఒక వర్గాన్ని టీడీపీ, మరో వర్గాన్ని కాంగ్రెస్ పంచుకోవాలన్న ఆలోచనతో నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.

     హైదరాబాద్ సిటీ నడిబొడ్డున రూ.400 కోట్ల విలువ చేసే 9 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు మనుషులకు మాజీ సీఎం రోశయ్య ధారాదత్తం చేయగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా గనులు కట్టబెట్టాలని చూడటం దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని సుచరిత విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారి సంబంధం పెట్టుకున్నారన్నారు. ఆర్టీఐ కమిషనర్ పదవులు పంచుకునే ప్రయత్నం చేశారన్నారు. ఎమ్మార్ కేసులో సీబీఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు.

     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అకారణంగా అరెస్ట్ చేసిన సీబీఐ ఆరు మసాలుగా బెయిల్ రాకుండా చేస్తోంది. ఐఎంజీ కేసులో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా సీబీఐ ఇప్పటి వరకు చంద్రబాబును పిలవలేదు, ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించలేదని సుచరిత ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీలే ఉండాలని మూడో పార్టీ, మూడో మనిషి ఉండకూడదని వీళ్లు చేస్తున్న నీచ రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు.

     అవరోధాలెన్ని ఉన్నా మనసుంటే దళితులు, గిరిజనులకు మేలు చేయవచ్చని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిరూపించారన్నారు. సంక్షేమ పథకాలన్నీ శాచ్యురేషన్ విధానంలో అమలు చేశారన్నారు. అలాగే, వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తూ వచ్చారన్నారు. పార్టీ ప్లీనరీలోగానీ, శ్రీ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్రలోగాని మా జెండా, అజెండాలో దళితుల అభివృద్ధి విడదీయలేని అంతర్భాగమని ఎమ్మెల్యే సుచరిత బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Back to Top