ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా...వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలిబాబు కేసు నీరు గార్చే కుట్ర చేస్తున్నారుబినామీలను కేసు నుంచి తెలివిగా తప్పిస్తున్నారు
హైదరాబాద్ః రాష్ట్రంలో జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించకుండా ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు చేస్తే మీ బినామీలు, మీకున్న సంబంధాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా అంటూ అధికారపార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఏ పరిస్థితుల్లో గగ్గోలు పెడుతున్నారో, వారి బాధలు ఎంత వర్ణణాతీతంగా ఉన్నాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో రూ.2,460 కోట్ల శారదాస్కాం జరిగితే అక్కడి ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ వేసి బాధితులకు న్యాయం చేసే దిశగా వెళ్తుందని... ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.10వేల కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగితే దానిపై టీడీపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదని చెవిరెడ్డి ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా టీడీపీ సర్కార్ ఎందుకు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
కోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని తెలిసే...సీఐడీ దర్యాప్తు అని చెబుతున్నారని, సీఐడీలో సైతం టీడీపీ అనుకూలమైన అధికారులను నియమించుకొని తూతూ మంత్రంగా జరిపి కేసును నీరుగార్చే కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. సుమారు 33లక్షల మంది జీవితాలతో చలగాటం ఆడుతూ ఆ కుటుంబాలను అధికార టీడీపీ రోడ్డున పడేస్తుందని భాస్కర్‌రెడ్డి ఫైరయ్యారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బ్రహ్మాండంగా సహకరిస్తుందని కోర్టుకు చెబుతున్న చంద్రబాబు...మరి రూ. 10వేల కోట్లను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
అగ్రిగోల్డ్ లో కారుచౌకగా భూములు కొనుగోలు చేసిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను..తెలివిగా కేసుల నుంచి తప్పిస్తున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. గవర్నమెంట్ జీవోలోకి వాళ్లు అమ్మిన భూములను రానీయకుండా చూసుకుంటున్నారని ఫైరయ్యారు. టీడీపీ వారికి భూములు అమ్మిన డైరెక్టర్‌లు అటాచ్‌మెంట్‌లోకి రారా..? వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. అగ్రిగోల్డ్ యాజమన్యంపై ఎందుకు చర్యలు తీసుకోరని కోర్టు చివాట్లు పెడితే ...అప్పుడు తూతూ మంత్రంగా కొందర్నిఅరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి తగునా అని చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ వైఖరిని ప్రజలంతా చూస్తున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏం చేయాలనుకుంటున్నావ్ బాబు అని నిప్పులు చెరిగారు. ప్రజలు ఏమైపోయినా పరవాలేదు. అధికారులు మా చేతిలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపులే తమ లక్ష్యమన్న విధంగా టీడీపీ వైఖరి ఉందని దుయ్యబట్టారు. అవినీతి డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్ప, నిజమైన బాధితులకు న్యాయం చేయాలన్న కనీస ఆలోచన టీడీపీకి లేదన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. ఎవరైతే ప్రజలను మోసం చేశారో వారందర్నీ అరెస్ట్ చేసి చూపించాలని సవాల్ విసిరారు.