బ్యాంకుల వడ్డీ దెబ్బకు మహిళల బెంబేలు

దేవరకద్ర (మహబూబ్‌నగర్‌ జిల్లా), 3 డిసెంబర్‌ 2012: బ్యాంకులు వేసే అధిక వడ్డీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బ్యాంకుల వసూలు చేస్తున్న వడ్డీల కారణంగా రుణాలు తీసుకోకపోవడమే మేలని మహిళలు అంటున్నారు. బ్యాంకుల మెట్లు ఎక్కాలంటేనే భయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నగదు బదిలీ వద్దని, కోటా బియ్యం సక్రమంగా సకాలంలో సజావుగా ఇస్తే చాలని వారు చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కోటాకజరలో షర్మిల సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు స్థానిక మహిళలు తమ బాధలు, భయాలను ఏకరువుపెట్టారు. జనం బాధలు పట్టని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు వ్యవహారానికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా తమ రేషన్‌ కార్డులను తీసేస్తారట అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ లాంటి నిరుపేదలు రోజు గడుపుకోవాలంటే రేషన్‌ కార్డులు ఉంచాలని, రేషన్‌ బియ్యం పథకాన్ని కొనసాగించాలని ఓ మహిళ డిమాండ్‌ చేసింది. మంచినీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

జగనన్న అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలు వారికి అందుతాయని హామీ ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షించారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ఈ మహిళల మాటలు వినిపించడం లేదా? అని నిలదీశారు. ఇచ్చే 4 కిలోల బియ్యం కూడా ఇవ్వడంలేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్ధి చెప్పాలని మహిళలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పాదయాత్రలో శ్రీమతి షర్మిలకు వేలాది మంది బ్రహ్మరథం పడుతున్నారు.
Back to Top