'బస్సు బాదుడు'పై వైయస్‌ఆర్‌సిపి నిరసనలు

హైదరాబాద్‌, 24 సెప్టెంబర్‌ 2012: పేదలు, సామాన్యులు ప్రయాణించే బస్సు చార్జీలను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచేయడంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోమవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సంపన్న వర్గాలు ఉపయోగించుకునే గరుడ వోల్వో ఏసీ బస్సులను వదిలేసి గ్రామీణులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కే పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల టిక్కెట్ ధరలు మాత్రమే పెంచడం వల్ల ఆ వర్గాలకు బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భారంగా మార్చిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అనేక చోట్ల బస్సు డిపోలను ముట్టడించి ఆందోళనలు చేస్తున్నది. బస్సు చార్జీలు తగ్గించాలంటూ రాస్తారోకోలు నిర్వహిస్తున్నది.

ఈ నిరసనల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెంచిన బస్సు చార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బస్సు బాదుడును తగ్గించి సామాన్య ప్రజలను ఆదుకోవాలని వారు కోరారు.
Back to Top