<strong>గూడూరు (కర్నూలు జిల్లా),</strong> 19 నవంబర్ 2012: కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్ధ ముఖ్యమంత్రి అని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మద్యం మాఫియా డాన్ అని కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మంత్రి వై. కిశోర్ చంద్రదేవ్ అభివర్ణించారని షర్మిల పేర్కొన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా స్వార్ధపరుడని ఆమె అన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల సోమవారంనాడు కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆ ముగ్గురు నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.<br/>ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు హంద్రీ నీవా ప్రాజెక్టును ప్రారంభించారని, ఆ సందర్భంగా ఆయన ప్రాజెక్టు పూర్తవడానికి కారణమైన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరును ఒక్కసారంటే... ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. దాన్ని పరిపాలనా దక్షత అంటారా? అని ప్రశ్నించారు. కిరణ్ కుమార్‌రెడ్డి సొంత తెలివితో ఏదీ చేయాల్సిన పని లేదని, రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ అమలు చేస్తే చాలన్నారు. అది కూడా సరిగ్గా చేయలేకుండా ఇంత అసమర్ఘంగా పరిపాలన సాగిస్తున్నారే! దాన్ని పరిపాలనా దక్షత అంటారా అని అడుగుతున్నాం అన్నారు. మేం అనడం కాదు, మీ సొంత పార్టీ వారే, మీ ఎమ్మెల్యేలే, మీ మినిస్టరే, ఈరోజు ఒక కేంద్ర మంత్రి కూడా అన్నారు, కిరణ్ అసమర్థంగా పని చేస్తున్నారని, బొత్స సత్యనారాయణ ఒక డాన్ అని. బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను పూర్తిగా ఆయన బినామీలకే కట్టబెట్టుకున్నారని ఆరోపించారు. దీన్ని పరిపాలనా దక్షత అంటారా అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణకు ఇతరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.<br/>నిజంగా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసన్నారు. కానీ ఆయనకు ప్రజలంటే పట్టదన్నారు. ప్రజల కోసం అవిశ్వాసం పెడతానని ఆయన మాటలు మాత్రమే చెబుతారన్నారు. ప్రజల కోసం చంద్రబాబు ఎప్పటికీ అవిశ్వాసం పెట్టరని షర్మిల విమర్శించారు. తనకు లాభం ఉందనుకుంటేనే ఆయన అవిశ్వాసం పెడతారన్నారు. పరిపాలనాదక్షత తనకే ఉందని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని షర్మిల విమర్శించారు. ప్రజలు ఎన్నుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్నారు. పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్‌లో నిర్బంధించి ఆయన సీఎం అయ్యారన్నారు. చంద్రబాబు పాదయాత్రను ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదన్నారు. అలాంటి చంద్రబాబును ఇక ప్రజలు ఎలా నమ్ముతారని షర్మిల ప్రశ్నించారు.