భోగాపురంపై శ్వేతపత్రం విడుదల చేయండి



– టీడీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి 
– లక్ష కోట్లు అప్పులు తెచ్చినోళ్లు ఉపాధి కూలీ చెల్లించలేరా
– లోకేష్‌ వ్యవహారం విచిత్రంగా ఉంది
– నంది అవార్డులనూ రాజకీయానికి వాడతారా
– విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్సా సత్యనారాయణ

అధికారంలో ఉంటే అవినీతికి లైసెన్సు దక్కినట్టు టీడీపీ నాయకులు ఫీలవుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 90 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలపై నోరు మెదపరేమని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిపులు చెరిగారు. గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే రాష్ట్రంలో మెషీన్లతో పనిచేయిస్తూ వారి కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు న్యాయం చేయాలని మాత్రమే వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులు అనుకూల మీడియాలో నీతిమంతులమని ప్రచారం చేసుకోవడం మాని అమాయక కూలీలకు న్యాయం చేయాలని హితవు పలికారు. నాలుగేళ్లలో లక్ష కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్ర్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిన వారు.. కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేరా అని ప్రశ్నించారు. 

నంది అవార్డులతోనూ రాజకీయమా
చంద్రబాబు రాజకీయం చేయడానికి నంది అవార్డులను కూడా వదల్లేదని బొత్సా సత్యనారాయణ ధ్వజమెత్తారు. మీ అవినీతి కారణంగా బోటు ప్రమాదం జరిగి 
22 మంది అమాయకులు బలైపోతే.. దాన్ని పక్కదారి పట్టించడానికి నంది అవార్డులను ప్రకటించి రచ్చ చేశారని తెలిపారు. నంది అవార్డుల బాగోతంపై ప్రశ్నించిన వారిని ఆధార్‌ కార్డులున్నాయా అని మంత్రి లోకేష్‌ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీలో ప్రభుత్వ అవినీతిపై ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రశ్నించే వారికి ఆధార్‌ కార్డులున్నాయా అని ప్రశ్నించే లోకేష్‌.. జ్యూరీ సభ్యులకు ఉన్నాయో లేదో చూసుకున్నారా అని ఎద్దేవా చేశారు. 

భోగాపురం ఎయిర్‌పోర్టు ఎప్పుడు ప్రారంభిస్తారు
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రీటెండర్లు నిర్వహించేందుకు కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు పథక రచన చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడో టెండర్లు పూర్తయితే ఇప్పటి వరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు పేరుతో వేల ఎకరాలు దోచుకుందామని ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వ్యూహ రచన చేశారని బొత్స చెప్పారు. ఎయిర్‌పోర్టుకు మొదట 22 వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఒత్తిడితో 12 వేల ఎకరాలకు తగ్గించారని అప్పటికీ అంత భూమి అవసరం లేదని వైయస్‌ఆర్‌సీపీ చేసిన ఆందోళనలతో 5300 ఎకరాలకు తగ్గాయని తెలిపారు. లేదంటే దోపిడీకి హద్దులు లేకుండా పోయేదన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పారు. 

తాజా వీడియోలు

Back to Top