అడ్డగోలు విభజన ఆంధ్రప్రదేశ్‌తోనే ఆగదు

భువనేశ్వర్‌, 24 నవంబర్ 2013:

రాష్ట్రాలను ‌అడ్డగోలుగా విభజించే ప్రక్రియ ఒక్క ఆంధ్రప్రదేశ్‌తోనే ఆగిపోదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, ‌కడప ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తన రాజకీయ లబ్ధి కోసం ఏ రాష్ట్రాన్నైనా విడదీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 సవరణకు జరుగుతున్న పోరులో సహకరించాలని ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయ‌క్ను కో‌రారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, రాజ్యాంగంలోని మూడవ అధికరణను సవరించాలని ఆయన చేసిన విజ్ఞప్తికి నవీన్ పట్నాయ‌క్ సానుకూలంగా స్పందించారు. నవీ‌న్ పట్నాయ‌క్తో భువనేశ్వ‌ర్లో ఆదివారం మధ్యాహ్నం సమావేశమైన తర్వాత‌ శ్రీ జగన్ మీడియాతో మాట్లాడారు.

‌'ఆర్టికల్ 3 ని సవరించాలని కోరాను, ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతోందో చెప్పాను. ఇది కొత్త సంప్రదాయం. ఇతర రాష్ట్రాలకు కూడా పాకవచ్చని తెలిపాను. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లేదా మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాన్ని తప్పనిసరి చేయాలని తెలిపాను. అలాగే పార్లమెంటులో కూడా చేయాలి. ఇది ఇక్కడితో ఆపకపోతే, ఆర్టికల్ 3ని సవరించకపోతే ఢిల్లీలో అధికారంలో ఉన్నవాళ్లంతా తమ ఇష్టారాజ్యంగా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతారు. అందుకే దీన్ని ఆపేందుకు సహకరించాలని నవీన్‌జీని కోరాను. ఆయన తన మద్దతు తెలిపారు. నవీన్ పట్నాయ‌క్కు, నాకు మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి, ఇవి మున్ముందు కూడా కొనసాగుతాయి' అని శ్రీ జగన్ చెప్పారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్న‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఒడిశా సీఎం‌, బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్ పట్నాయ‌క్తో భేటీ అయ్యారు. శ్రీ జగన్‌కు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
నవీన్ పట్నాయ‌క్ను కలవడానికి ముందు పై-లీ‌న్ ప్రభావంతో నష్టపోయిన కళింగాంధ్రులను‌ శ్రీ జగన్ కలిశారు. తు‌పాను నష్టం తీవ్రత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని శ్రీ జగన్ ఎదుట కళింగాంధ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందా అంటూ ఒడిశా మీడియా పదే పదే జగన్ను శ్రీ వైయస్ జగన్ ఒడిశా పర్యటన సందర్భంగా  ప్రశ్నించింది.

రాజకీయ వర్గాలతో చర్చను గాలికొదిలేశారు - నవీన్ పట్నాయ‌క్ :
‌సంకుచిత రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విడదీయరాదని నవీన్‌పట్నాయక్ అన్నారు. రాష్ట్ర విభజన సమస్యను శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తనతో చర్చించారని, రాష్ట్ర విభజన అనేది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా సున్నితమైన అంశమని ఆయన తెలిపారు. ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరమని, అంతే తప్ప కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రాలను విడదీయడం సరికాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో రాజకీయ‌ వర్గాలతో నిశిత చర్చను పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు.

కాగా, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవా‌ర్‌ను శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కలుస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో కూడా భేటీ అవుతారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇవ్వా‌లని వారిద్దరినీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరనున్నారు.

Back to Top