ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయని విభజన

న్యూఢిల్లీ :

రాష్ట్ర విభజనపై‌ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినా, ఇరు ప్రాంతాలకు మాత్రం‌ అది న్యాయం చేయలేకపోయిందని జెడి(యు) అధినేత శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని తాము బలంగా కోరుకుంటున్నామన్నారు. విభజనతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

‌వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం శర‌ద్‌యాదవ్‌తో ఆయన నివాసంలో 20 నిమిషాల పాటు సమావేశం అయింది. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనను ఆయన దృష్టికి తెచ్చింది. ముఖ్యంగా నదీ జలాలు, విద్యుత్ పంపిణీ, హైదరాబాద్, ఉద్యోగులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలకు ఎలాంటి పరిష్కారమూ చూపలేదని వివరించింది. సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలను శ్రీమతి విజయమ్మ తమ దృష్టికి తెచ్చారని అనంతరం శరద్‌యాదవ్ విలేకరులకు చెప్పారు. ఈ అంశం తప్ప మరేమీ చర్చకు రాలేదన్నారు.

‌మీరు గతంలో తెలంగాణకు మద్దతిచ్చారు, ఇప్పుడు మీ వైఖరెలా ఉంది అని మీడియా అడిగినప్పుడు ‘‌ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ కాంగ్రెస్ నిర్ణయం చేసింది. అయితే అక్కడ అనేక సమస్యలున్నాయి. వాటన్నింటిపై చర్చించాల్సిన అవసరముంది’ అని శరద్‌యాదవ్ బదులిచ్చారు. విభజనతో అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారా అని అ‌డిగితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయచేయబోనన్నారు. భావి పొత్తుల అంశమేదీ రాలేదని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. మర్యాదపూర్వకంగానే శరద్‌యాదవ్‌ను కలిశామని, సీమాంధ్రలోని పరిస్థితులను వివరించామని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

రాజీనామాలకు కట్టుబడాలి:
విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను శరద్‌యాదవ్‌కు వివరించినట్టు పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రపతితో, ప్రధానితో శ్రీమతి విజయమ్మ బృందం సమావేశంపై టిడిపి నాయకుల ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేవలం విభజన విషయమై చర్చించేందుకే అందరినీ కలిశామని చెప్పారు. రాజీనామాలపై తామంతా చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ‘సమైక్యాంధ్ర కోసం అందరం రాజీనామాలు చేశాం. సమైక్యాంధ్ర ప్రకటన వస్తే ఉపసంహరించుకుందాం. లేదంటే వాటికి అంతా కట్టుబడి ఉండాలి’ అని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top