బందుపై యెల్లో మీడియా అసత్య ప్రచారం

బందు విషయమై చెప్పవలసింది ముఖ్యంగా ఒకటుంది. ఇది కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చేపట్టింది కాదు. కరెంటు కోతలతో అట్టుడికిపోతున్న ప్రజల వెతలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు చేపట్టిన కార్యక్రమమనే మౌలిక అంశాన్ని మీడియా విస్మరించింది.

బందు నిర్వహించడానికి బయటకొచ్చిన నేతలను వచ్చినవారిని వచ్చినట్టే పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో తాను పోలీసు స్టేషను నడిచే వస్తాననీ, జీపు ఎక్కననీ స్పష్టంచేసిన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సతీమణి పద్మప్రియను గార ఎస్ఐ నారీమణి, ఇతర కానిస్టేబుళ్ళు రోడ్డుపై ఈడ్చుకెళ్ళి, జీపులో ఎత్తి పడేశారు. ఈ ఘటనను చూసిన కృష్ణదాస్ పద్మప్రియను తన వాహనంలో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో ఆయన చేతి వేళ్ళకు గాయాలయ్యాయి. పోలీసులు తనతో వ్యవహరించిన తీరుపై స్పీకరుకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. సంఘటనను ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళి, ఎస్ఐపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ కన్నీటిపర్యంతమయ్యారు. వాస్తవం ఇలా ఉంటే, కృష్ణదాస్ పోలీసులపై దౌర్జన్యం చేశారని యెల్లో మీడియా కథనాలను వండి వార్చింది. పోలీసుల తప్పేమీ లేదని చెప్పడానికి తంటాలు పడింది. ఛానెల్సులో కనిపించే దృశ్యాలకు తన భాష్యాన్ని అలవోకగా అల్లేసింది.

పంతం కొద్దీ ప్రభుత్వం ఖాళీ బస్సులను తిప్పి బందు లేదని చెప్పడానికి నానా తంటాలు పడింది. అధికార బలాన్ని ఉపయోగించి, కొన్ని విద్యాసంస్థలను పనిచేసేలా చూసింది. జేఎన్టీయూ, ఉస్మానియా, తదితర విద్యా సంస్థలు తమ పరిథిలో పరీక్షలు వాయిదా వేసుకన్నాయి. సినిమా హాళ్ళు మూతపడ్డాయి. బ్యాంకులు తెరచుకోలేదు. వ్యాపార సంస్థలు పనిచేయలేదు. రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.

ఇవేవీ యెల్లో మీడియాకు కనిపించలేదు. బంద్ విఫలమైందంటూ పనికట్టుకుని ప్రచారం చేపింది, ప్రజా జీవనానికి ఏమాత్రం ఇబ్బంది కలగలేదని కూడా చెప్పుకొచ్చింది. బంద్ ఉద్దేశం ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించడం కాదు. ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు వెతలను ప్రభుత్వ దృష్టికి తేవడమేనన్న ఆశయాన్ని ఆ మీడియా విస్మరించింది. బంద్ విజయవంతమైందనే అంశం వెల్లడైతే, రాజకీయంగా వైయస్ఆర్ సీపీకి మార్కులు ఎక్కడ ఎక్కువ పడిపోతాయోననే దుగ్ధతో వ్యవహరించింది.

ఆందోళనలో భాగంగా జరిగిన ప్రతి సంఘటనకూ పార్టీదే బాధ్యతగా చూపాలని ప్రయత్నించింది. గుంటూరు, పులివెందుల, తదితర ప్రాంతాలలో చోటుచేసుకుంటున్నసంఘటనలను భూతద్దంలో చూపింది. యెల్లోమీడియా తన ప్రసార, ముద్రణ మాధ్యమాలలో బందు గురించి రాయకపోయినా వాస్తవాలను కొన్ని ఛానెల్సు చెప్పకనే చెప్పాయి. అరచేయి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎంత అసాధ్యమో.. ప్రజా ప్రయోజనాలకోసం చేపట్టిన ఆందోళనలను చిన్నవిగా చేసి చూపడమూ అంతే. ఒకరు చెప్పనంత మాత్రానా జరగలేదని నమ్మే స్థితిలో బాధలు పడుతున్న ప్రజలు ఉండరనే వాస్తవాన్ని సంబంధిత ఛానెల్సు గమనించడం శ్రేయస్కరం. విఫలం అన్న పదంలో దాగున్న ఫలం ప్రయోజనాన్ని పొందడంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సఫలమైంది.

Back to Top