చంద్రబాబు పట్టుబడ్డ దొంగ: తమ్మినేని

హైదరాబాద్ 28 సెప్టెంబర్ 2013:

సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పట్టుబడ్డ దొంగని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత తమ్మినేని సీతారాం అభివర్ణించారు. ఐఎమ్జీ, ఎమ్మార్ కుంభకోణాల నుంచి బయటపడేస్తే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తానని చిదంబరంతో అర్ధరాత్రి కుమ్మక్కయ్యింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. అలాంటి వ్యక్తి విజయమ్మ గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనడమేంటని ప్రశ్నించారు. బెయిలు వచ్చినందుకు రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారనడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. బెయిలు ఎలా వచ్చిందో చంద్రబాబుకు తెలియదా అని అడిగారు. సుప్రీం కోర్టు సీబీఐకి దర్యాప్తు నిమిత్తం సమయ నిర్దేశం చేసిన విషయాన్ని మరిచారా అని కూడా ప్రశ్నించారు. చార్జి షీట్లు దాఖలు చేయడం పూర్తయిన తర్వాత బెయిలు వస్తే ఇన్ని రకాలుగా ఆరోపణలు చేయడమేమిటన్నారు. తాను సమైక్యవాదో, విభజన వాదో స్పష్టం చేయాలని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రజల ముందు మీరు పచ్చి అవకాశవాదిగా నిలబడబోతున్నారని స్పష్టంచేశారు. అవకాశాన్ని వీడాలని సూచించారు. పదవీ వ్యామోహంతో ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖను కప్పిపుచ్చుకోవడానికే ఇన్ని నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. 'మేం చెప్పిందే కరెక్టనీ తప్పించుకోలేరు... ఎందుకంటే మీపై మేము చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం' అని తమ్మినేని హెచ్చరించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామో లేదో చెప్పాల్సింది పోయి... ఇవేం చవకబారు ఆరోపణలని ఆయన ఎద్దేవా చేశారు. చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపితే కట్టుబడతామని సవాలు చేశారు.

Back to Top