బాబేమో విజయవాడ,ఉద్యోగులేమో హైదరాబాద్..!

నిత్యవసర ధరల పెరుగుదలతో సామాన్యుడు బతికలేని పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు.  ధరలను నియంత్రించాలని గానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గానీ, రైతులకు మేలు చేయాలన్న ఆలోచనగానీ చంద్రబాబుకు ఏమాత్రం లేకపోవడం శోచనీయమన్నారు. ఎంతసేపు రాజధాని కట్టాలి. దాని చుట్టూ ఉన్న రైతుల భూములు దోచుకొని, ఎక్కువ రేటుకు అమ్ముకోవాలన్నదే తప్ప చంద్రబాబుకు ఇంకోటి లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఓ విధంగా, లేనప్పుడు మరో విధంగా ప్రవర్తిస్తాడని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

నధుల అనుసంధానం అయ్యిందిని, పట్టిసీమతోనే రాష్ట్రం బాగుపడుతుందని భ్రమలు కల్పిస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని పెద్ది రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి చేసిన పనులనే తాము చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక రాష్ట్రంలో ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని అయోమయం నెలకొందని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబు విజయవాడ వదలడు, ఉద్యోగులేమో హైదరాబాద్ వదలడం లేదని ఎద్దేవా చేశారు. 

అమరావతికి ఫోర్ లైన్స్, 6 లైన్స్ అంటున్న చంద్రబాబు...చిత్తూరులో పుట్టి ఏం చేస్తున్నావని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు . తిరుపతి పట్టణానికి హైకోర్టు తీసుకురావాలని పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిదంగా ధరల పెరుగుదలతో పాటు, రాయలసీమ పట్ల చంద్రబాబు చూపుతున్న వివక్షతపై వైఎస్సార్సీపీ పోరాడుతుందని పెద్దిరెడ్డి  స్పష్టం చేశారు. 

Back to Top