సమాధానం చెప్పలేక బాబు అసహనం

  • ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోయిన ప్రభుత్వం
  • గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సీఎం స్పీచ్‌లో అసత్యాలు
  • ప్రతిపక్ష నేత ప్రసంగానికి అడ్డుపడిన అధికార పక్షం
  • సహనం కోల్పొయిన సీఎం చంద్రబాబు
  • కాపులకు ఎంత ఖర్చు చేశారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం
  • రిలీజ్‌ చేసిన డబ్బును ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీసిన వైయస్‌ జగన్‌
  • నిరుద్యోగ భృతిపై బాబు చెప్పిందేంటీ? చేస్తున్నది ఏంటీ
  • బడ్జెట్‌ పద్దులపై సర్కార్‌ను నిలదీసిన వైయస్‌ జగన్‌
ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను అధికార పక్షం తప్పుదోవ పట్టించింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసహనానికి గురైన టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహనం కోల్పొయి అన్‌పార్లమెంటరీ పదాలు వాడి సభకు మచ్చ తెచ్చాడు. సోమవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సీఎం చంద్రబాబు స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. బడ్జెట్‌ పద్దులపై సభలో వాడీవేడీగా చర్చ జరుగుతుండగా సూటీగా సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేత ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడి ఇష్టారాజ్యంగా సభను నడిపారు. వైయస్‌ జగన్‌ మాట్లాడుతుండగా నిర్ధాక్షిణంగా మైక్‌ కట్‌ చేశారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు కోరినా స్పీకర్‌ పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలకు మైక్‌ ఇచ్చి తిట్టించే కార్యక్రమం చేశారు. సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వరుస మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను నాలుగు రోజుల్లో కరువు వెళ్లిపోయిందని ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని మండిపడ్డారు.  చంద్రబాబు నిజాలు చెప్పి ఉంటే సంతోషించేవాళ్లమని, ఇలా కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. కరువును పారద్రోలేందుకు ఎయిర్‌గన్లు కొనుగోలు చేసిన దానికంటే, వాటిని ఆపరేట్‌ చేసేందుకు అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయి అనడానికి  ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పారు. ఇదే చంద్రబాబు అదే డ్రింప్‌ కంపెనీలతో మళ్లీ  ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ అలవాటు బాబుకే ఉంది
అసెంబ్లీని తప్పుదోవ పట్టించే ఖర్మ, అలవాటు చంద్రబాబుకే ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వెల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి చర్చ జరిగేటప్పుడు తప్పుడు లెక్కలు చెప్పారుని, ప్రాజెక్టులపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ నిధులకు సంభందించి చాలా తప్పులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చే శారు. ఏపీ ఫైనాన్స్‌ కోర్‌ డ్యాష్‌ బోర్డును గమనిస్తే ఫిబ్రవరి 20న మైనారిటీలకు సంబంధించి రూ.623 కోట్లు బడ్జెట్లో కేటాయించారని, వీటిలో రూ.470 కోట్లు ఖర్చు చేశారని వైయస్‌ జగన్‌ చెప్పారు. టీడీపీ సభ్యులు మాత్రం సభలో   మొత్తం ఖర్చు చేసినట్లు చెబుతుండటం అన్యాయమన్నారు. కేటాయింపులకు, ఖర్చు చేసిన లెక్కలకు పొంతన లేదని విమర్శించారు. బీసీ వెల్పెర్‌కు రూ.4066 కోట్లు కేటాయిస్తే..ఫిబ్రవరి నాటికి రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. ఏం జరుగుతోందో మీరు నమోదు చేసిన కోర్‌డ్యాష్‌ బోర్డునే చూసుకోవాలని సూచించారు. బీసీ వెల్ఫేర్‌కు సంబంధించి  విడుదల చేసిన అమౌంట్‌కు, ఖర్చు చేసిన అమౌంట్‌కు చాలా తేడా వచ్చిందని విమర్శించారు. ఇదే సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంలో తేడాలు ఉన్నాయని ఆక్షేపించారు.

కాపులకు మీరు చేసిందేంటీ?
ఎన్నికలకు ముందుకు కాపులకు ఎన్నో  హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని వైయస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. కాపులకు సంబంధించి ప్రతి ఏటా బడ్జెట్లో వెయ్యి కోట్ల కేటాయిస్తానని హామీ ఇచ్చారని, అయితే టీడీపీ కేటాయించింది కేవలం రూ.380 కోట్లు మాత్రమే అన్నారు. మంజునాథన్‌ కమిషన్‌ వేసి 8 నెలల్లో రిపోర్టు వస్తుందని చెప్పినా ఇంతవరకు ఎలాంటి నివేదికలు రాలేదన్నారు. మైనార్టీలపై చంద్రబాబు ప్రేమ ఒలకబోశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 4800 మసీదులకు ప్రభుత్వం కేవలం రూ.3.50 కోట్లు ఇచ్చి గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు.

రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది
బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన అధికార పార్టీ నిరుద్యోగులకు ఏం చేసిందని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.  ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటీ? అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏంటీ అని నిలదీశారు. బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ లెక్కన ఏటా రూ.40 వేల కోట్లు నిరుద్యోగ భృతి చెల్లించకుండా ఎగనామం పెట్టారని, ముష్టి వేసినట్లు రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నష్టాల్లో ఉంటే అవార్డులా
విద్యుత్‌కు సంబంధించిన డిస్కమ్‌లు నష్టాల్లో ఉంటే మనకు ఐదు అవార్డులు వచ్చాయని చంద్రబాబు మభ్యపెడుతున్నారని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఈ డిస్కమ్‌లుæ రూ.2400 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, అయినా ఐదు అవార్డులు వచ్చాయని అసత్యాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.  

అభివృద్ధి, అవినీతిలో ఏపీ నంబర్‌వన్‌
 సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నారు. దేశంలోనే అభివృద్ధిలో, అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామని స్వయంగా బాబే వెల్లడించడంతో సభ్యులు నోరు వెళ్లబెట్టారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం మొదలు, మంత్రుల దాకా ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడికి దిగారు. సభలో చంద్రబాబు అన్‌పార్లమెంటరీ పదాలు వాడారు. వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు అలగాజనమని సంభోదించిన సీఎం, బడ్జెట్‌ పద్దులపై రేపు సమాధానం చెబుతామని తప్పించుకున్నారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అధికార పార్టీ నేతలు. ప్రతిపక్ష నేతలను కించపరిచేలా   పరుషపదజాలం ఉపయోగించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చంద్రబాబు సహనం కోల్పొయారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆవేశానికి లోనయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంగ్లీష్‌లో ఒక మాట, తెలుగులో మరోమాట చెప్పారు. ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్ద నిరసన తెలిపారు. అయినా పట్టించుకోకుండా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించుకొని సభను వాయిదా వేశారు.

తాజా వీడియోలు

Back to Top