కొత్త మిత్రుల కోసం బాబు వెంపర్లాట

రోజుకో వేషం వేస్తున్న చంద్రబాబు
ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం
ఏపార్టీతోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం వైయస్ఆర్ సీపికి లేదు
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

విజయవాడ: రాష్ట్రంలో ఎవరో ఒకరి సాయం లేకుండా నడవలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త మిత్రుల కోసం వెంపర్లాడుతున్నారని, ద్రోహులు ఓడిపోతారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయనకు పూర్తిగా వర్తిస్తాయని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

 ఫిబ్రవరిలో ప్రత్యేక హోదా సాధన కోసం గత ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో పార్టీ తరపున తమ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక  ఉద్యమ కార్యాచరణను ప్రకటించారనీ.  పార్లమెంటులో పోరాటంతోపాటు, ఎంపిల రాజీనామాల అంశం అందులో ఉందని,  తదుపరి  దానికి అవిశ్వాస  తీర్మానాన్ని కూడా జోడించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన ద్రోహులు ఓడిపోతారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే దొంగా దొంగా అని ముందుగా అరిచినట్లుగా ఉందన్నారు. 

 చంద్రబాబు నాయుడు  అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇస్తామన్నారు, అంతకు ముందు అవిశ్వాస తీర్మానం పెడితే ఏం ప్రయోజనమన్నారు, అటు తరువాత నేను ఎవరికీ మద్ధతు ఇవ్వను, నేనే అవిశ్వాసం పెడతామంటూ ప్రకటించారు. ఇన్ని పిల్లిమొగ్గలు వేసిన చంద్రబాబు, మొదట ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజి అన్నారు ఇప్పుడు హోదా కోసం ఏమైనా చేస్తానంటున్నారు. ఇలా ఇన్ని రకాలుగా నాలుకను ఇష్టం వచ్చిన తిప్పి మాట్లాడిన వారు దేశ రాజకీయాల్లో ఎవరూ లేరని అంబటి మండిపడ్డారు.
 సినీ నటుడైన  చిత్తూరు ఎంపి శివప్రసాదరావు రోజుకో వేషం వేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు శివప్రసాద్ ను మించిన వేషాలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, దేశం మొత్తం మీద ఇన్ని వేషాలు వేస్తున్నది చంద్రబాబు ఒక్కరేననీ  ఆయనను మించిన  నటుడు ఎవరూ లేరన్నారు. 
 భుజాన వేసుకుని అధికారంలోకి తీసుకుని వచ్చిన  బిజెపి, జనసేన మిత్రులు దూరం అయిన పరిస్థితుల్లో, కొత్త మిత్రుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఎవరో ఒక మిత్రుడు వెంట లేకుంటే ఆయన నడవలేడు. ఈ రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ కు చేరువ అయ్యేందుకు దోస్తీ కోసం సిద్ధపడ్డారు. అశాస్త్రీయంగా విభజించారంటూ కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో కలిసి వెళ్లాలనుకోవడం రాజకీయ అవకాశావాదానికి నిదర్శనమన్నారు. ఇటువంటి వేషగాడిని,తడవకో మాట, పూటకొక వేషంతో వికృతంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకుడుకి బుద్ది చెప్పాలన్నారు. చంద్రబాబుకు  ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారు బిజెపితో కలిసి పోయారంటూ ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
 చంద్రబాబు వెన్నుపోటు నైజం  గురించి ఈ రోజే తెలుసుకున్నట్లుగా బిజెపి నేతలు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అంబటిరాంబాబు అన్నారు. బిజెపితో తమ పార్టీకి  కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం ఎంతమాత్రం లేదనీ, ఏ పార్టీతోనూ చీకటి ఒప్పందాలు చేసుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. 2014 లోనే బిజెపి తమతో కలవడానికి ముందుకు వచ్చినా వద్దన్న సంగతిని గుర్తు చేశారు. 
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చెప్పకుండా అబద్దాలు చెపుతున్నారు. ఆయనను ఎవరో అణచివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వాస్తవంలో ఆయన చేసినఅన్యాయాలు, అవినీతితో మూటగట్టుకున్న పాపపు చేష్టలే ఆయనను ప్రజలకు దూరం చేస్తున్నాయి. ఇదే ఆయన పాలిట శాపమైందని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయ నాయకులు దేశంలో ఎవరూ లేరని పేర్కొన్నారు. 
వైయస్ ఆర్ సీపీ ముందు నిర్దేశించుకున్న, ప్రకటించిన అజెండా ప్రకారమే ప్రత్యేక హోదా పై పోరాటాన్ని కొనసాగిస్తోందని, తమ పార్టీకి చెందిన 5మంది ఎంపిలు రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. 
 ప్రత్యేక హోదా కోసం నిరంతరం చిత్తశుద్ధితో పోరాడుతామంటూ చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేసే లక్షణాలు తమపార్టీకి లేవన్నారు.
Back to Top