చంద్రబాబు ప్రచారం దుర్మార్గం

ఏలూరు))
ప్రత్యేక హోదా మీద చంద్రబాబు చేస్తున్న ప్రచారం దుర్మార్గం అని ప్రతిపక్ష నేత,
వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా
ముఖ్యకేంద్రమైన ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఆయన యువభేరి నిర్వహించారు.
ప్రత్యేక హోదా ఆవశ్యకత మీద యువత, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక హోదా  ఇవ్వాలని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు, బీజేపీ పెద్దలు...ఎన్నికలయిపోయాక ప్రజలతో
పనైపోయిందని హోదా ఇవ్వకుండా మోసం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా
విభజించి....ఇవాళ హోదా వల్ల ఏం వస్తాయంటూ చంద్రబాబు ప్రచారం చేయడం
దుర్మార్గమన్నారు. ప్రత్యేక హోదా మీద అనేక దశల్లో ఉద్యమాలు,
పోరాటాలు చేస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారని, ఆ
సమయంలో నష్టాన్ని కొంత మేర పూడ్చేందుకు ప్రత్యేకహోదా ను ప్రకటించారని వైయస్ జగన్
పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్యనాయుడు రక రకాలుగా మాట మారుస్తున్న
వైనాన్ని డిస్ ప్లే చేసి చూపించారు. తర్వాత వైయస్ జగన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ
ఆర్థికసంఘాన్ని బూచిగా చూపించి హోదాను తాకట్టు పెడుతున్నారని వైయస్ జగన్
మండిపడ్డారు. 

Back to Top