‘బాబు’ పాదయాత్రతో ఒరిగింది శూన్యం

నిర్మల్:

ఆదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రతో ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ విమర్శించారు. ప్రజాస్పందన లేక ఆయన బాధతో తిరిగి వెళ్లారని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. బాసరలో లిఫ్ట్ కెనాల్ సీసీ లైనింగ్ కోసం రూ.30 కోట్లు కేటాయిస్తానని నాలుగుసార్లు వాగ్దానం చేశారని, నిధులు మంజూరు చేయకపోవడంతో నాలుగు వేల ఎకరాల ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2002లో భైంసా, బోథ్‌లలో బీడీ కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి మొండి చేయి చూపారని తెలిపారు. సింగరేణిలో కార్మికుల సంఖ్యను కుదించడంతో అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆరోపించారు. పాదయాత్రలో శ్రీ వైయస్.జగన్మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సబబుకాదన్నారు.

Back to Top