బాబుకు సభ్యత, సంస్కారం లేదు: షర్మిల

విజయవాడ, 28 మార్చి 2013: స్వార్థం కోసం, అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన ఆయన ప్రజల సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆయనకు సభ్యత సంస్కారాలు లేవన్నారు. కేవలం అధికార దాహం, ధన కాంక్ష మాత్రమే చంద్రబాబుకు ఉన్నాయన్నారు. తండ్రిని జైలులో పెట్టిన ఔరంగజేబు కన్నా చంద్రబాబు నీచుడని అభివర్ణించారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవన్నట్లుగా చంద్రబాబు కుట్రలు పోవని తీవ్రంగా విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల గురువారం రాత్రి విజయవాడలోని రాణిగారితోటలో జరిగిన బహిరంగసభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరెంటు చార్జీల పెంపుపై ఆమె విరుచుకుపడ్డారు.

వైయస్‌ఆర్‌ స్పీకర్‌ని చేయకపోతే కిరణ్‌ కనిపించేవారా? :
మోసాలకు, అసత్యాలకు చంద్రబాబు ‌చిరునామాగా నిలిచారని శ్రీమతి షర్మిల విమర్శించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి సీల్డు కవర్ ‌సిఎం అని ఎద్దేవా చేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని నిప్పులు చెరిగారు. కొన్ని పథకాలకు పాడె కట్టారన్నారు. నిజానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి సిఎం కావాలని ప్రజలు కోరుకోలేదన్నారు. తాను సిఎం అవుతానని కిరణ్‌ కూడా అనుకుని ఉండరన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ స్పీకర్‌గా చేసి ఉండకపోతే కిరణ్‌ కనిపించేవారా? అని ప్రశ్నించారు. మహానేత వైయస్‌పై కిరణ్‌ అకారణంగా ద్వేషం పెంచుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజల మనసుల నుంచి వైయస్‌ఆర్‌ను తుడిచేయాలని చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

మహానేత మాటలు నిలబెట్టని కాంగ్రెస్‌ ప్రభుత్వం:
రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు‌ వచ్చే ఐదేళ్ళ వరకూ కరెంటు చార్జీలు పెంచబోనని మహానేత వైయస్ ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయన హామీలను నిలబెట్టలేదని నిప్పులు చెరిగారు. విద్యుత్‌ చార్జీలను కిరణ్‌ ప్రభుత్వం విపరీతంగా పెంచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు విద్యుత్ సంక్షోభం ఇంతగా పెరిగిపోవడానికి సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డే కారణం అని దుమ్మెత్తిపోశారు. మహానేత వైయస్‌ పేదల కష్టాలు చూసి చలించిపోయారన్నారు. ఆయన పేదల పక్షాన పెన్నిధిగా నిలిచారన్నారు. ప్రజలకు తాను చేయాలనుకున్న మేలంతా చేశారని తెలిపారు. ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీ పెంచలేదన్నారు. ఏ చార్జీలు పెంచకుండా, పన్నులు వేయకుండా ప్రజా రంజకంగా పరిపాలన సాగించిన ఏకైక సిఎం మహానేత వైయస్‌ అన్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పాదయాత్ర చేసిన మహనీయుడు వైయస్‌ అని ఆమె గుర్తుచేశారు.

మామ పోస్టుకు ఎసరు పెట్టిన ఘనుడు బాబు :
చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మంత్రి కూడా అయ్యారని, మంచివాడేమో అనుకుని ఎన్టీఆర్‌ పిల్లనిచ్చారని శ్రీమతి షర్మిల అన్నారు. తరువాత టిడిపి గెలిచి కాంగ్రెస్‌ ఓడిపోయినప్పుడు చంద్రబాబు మామ పార్టీలోకి జంప్‌ జిలానీ అయ్యారని అన్నారు. అల్లుడే కదా అని ఆయన ఒక పోస్టు ఇచ్చారని, అయితే ఉచ్ఛ నీచాలు లేని చంద్రబాబు తన మామ పోస్టుపైనే కన్నేశారని ఆరోపించారు. అనంతరం ఆయన కుర్చీ లాగేసుకుని, మీద చెప్పులు కూడా వేయించిన నీచ సంస్కృతి చంద్రబాబుది అన్నారు.

ప్రజలను పురుగులు కన్నా నీచంగా చూశారన్నారు. చంద్రబాబు తీరుతో లక్షలాది మంది రాష్ట్ర ప్రజలు పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన హయాంలో వేలాది మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తంచేశారు. చంద్రబాబు హయాంలో పెద్ద పెద్ద సంస్థల ఆస్తులను ముక్కలుచేసి తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేశారని విమర్శించారు. ప్రజల నుంచి దోచుకోవడం, దాచుకోవడమే చంద్రబాబుకు తెలిసిన కుటిల విద్య అని ఆరోపించారు.

పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్ళారా చూస్తున్న చంద్రబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ అసమర్థ, ప్రజా కంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే నిస్సిగ్గుగా దానికి మద్దతు ఇచ్చారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ఇలాంటి చంద్రబాబు ప్రజానాయకుడా? ప్రతినాయకుడా? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వానికి చంద్రబాబు రక్షణ కవచంలా నిలిచి చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని నిప్పులు చెరిగారు.

ఒక్క మాటే జగనన్న జీవితాన్ని మార్చేసింది :
ఇంతవరకూ ముగ్గురు సిఎంల గురించి మాట్లాడుకున్నాం. ఇక కాబోయే సిఎం గురించి ఒక మాట చెప్పుకుందాం అని శ్రీమతి షర్మిల అన్నారు. జగనన్న గురించి కూడా చెప్పుకుందాం అన్నారు. ఓదార్పుయాత్ర చేస్తానని ఇచ్చిన ఒక్కమాట జగనన్న జీవితాన్నే మార్చేసిందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఓదార్పుయాత్ర చేస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయంగా ఎదగనివ్వదని చెప్పినా జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని గుర్తుచేశారు. రాజకీయాలు లేకపోయినా ఫర్వాలేదు గానీ, మాట నిలబెట్టుకోకపోతే రాజన్న కొడుకును ఎలా అవుతానని జగనన్న అన్నారని‌ శ్రీమతి షర్మిల చెప్పారు. అందుకే జగనన్నపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అన్నారు. ‌జగనన్న త్వరలో బయటకు వస్తారని, రాజన్న రాజ్యం దిశగా మనలను నడిపిస్తారని ఆమె భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. సభా ప్రాంగణం అంతా జగన్నినాదాలతో హోరెత్తిపోయింది. శ్రీమతి షర్మిలను చూసిన ప్రజలు రాజన్నను గుర్తుచేసుకుని హర్షం వ్యక్తం చేశారు.
Back to Top