'అవిశ్వాసానికి వైయస్‌ఆర్‌సిపి మద్దతు'

హైదరాబాద్, 11 మార్చి 2013: అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామన్న టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. టిఆర్‌ఎస్‌ ప్రతిపాదన ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత భూమా శోభా నాగిరెడ్డి తెలిపారు. అయితే, టిఆర్‌ఎస్‌ ఏ అంశంపైన అవిశ్వాసం పెట్టాలనుకుంటున్నదో తెలియలేదన్నారు. ప్రజా సమస్యలపైన ఆ పార్టీ అవిశ్వాసం పెడితే తాము తప్పకుండా మద్దతు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వంపై టిఆర్‌ఎస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించిన నేపథ్యంలోశోభా నాగిరెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టిఆర్‌ఎస్సే కాదు ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా టిడిపిదే అని తాము ఎప్పుడో చెప్పామన్నారు. ఇదే విషయాన్ని శ్రీమతి షర్మిల కూడా డిమాండ్‌ చేసిన విషయం ఆమె గుర్తు చేశారు. కానీ టిడిపి నుంచి స్పందన కరవైందన్నారు.
Back to Top